తన నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ దాడి చేసి రాళ్లు రువ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచినందుకు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. పేకాట రాయుళ్లను వెనకేసుకు వచ్చే క్రమంలో రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు పోలిస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని ఎస్పీ ప్రకటించారు. ఈ వ్యవహారం పూర్వా పరాలను ఆయన వివరించారు.
మలికిపురం ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతుండగా అక్కడి ఎస్సై పట్టుకున్నారన్నారు. వారి నుంచి డబ్బు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశారని తెలిపారు. అలా తమ వాళ్లు అరెస్టు కావడాన్ని సహించలేని ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఎస్సైపై దూషణకు దిగారట. వారిని అక్కడే వదిలిపెట్టాలని ఆదేశించాడట. అయితే స్టేషన్ కు వచ్చి బెయిల్ తీసుకోవచ్చని సూచించి ఎస్సై వారిని అరెస్టు చేసినట్టుగా ఎస్పీ ప్రకటించారు.
ఆ తర్వాత రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు స్టేషన్ మీదకు దాడికి దిగారని, మొదటే ఆ పేకాట వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నట్టుగా ఎస్పీ తెలిపారు. మొదట పేకాట రాయుళ్ల అరెస్టుకు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదని, అయితే ఆ తర్వాత ఎస్సై మీద దాడికి దిగారని ఎస్పీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను ఎస్సై ఏదో దూషించాడని అంటూ స్టేషన్ మీదకు దాడికి దిగారని, ఆ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారని.. ఈ మేరకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు అయినట్టుగా వివరించారు. మొత్తానికి జనసేన ఎమ్మెల్యే పేకాట రాయుళ్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్ మీదకు దాడికి దిగి కేసులను ఎదుర్కొంటుడటం విడ్డూరం!