గ‌రికపాటి వివాదంపై చిరు ఏమన్నారంటే…!

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన ‘అలయ్‌ బలయ్‌’లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య చిన్న‌పాటి వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. తన ప్ర‌సంగానికి మెగాస్టార్ చిరంజీవి ఫొటో సెష‌న్…

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన ‘అలయ్‌ బలయ్‌’లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య చిన్న‌పాటి వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. తన ప్ర‌సంగానికి మెగాస్టార్ చిరంజీవి ఫొటో సెష‌న్ అడ్డంకిగా మారింద‌ని గ‌రిక‌పాటి ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి గారూ అంటూనే కాస్త క‌ఠినంగా గ‌రిక‌పాటి నోరు చేసుకున్నారు.

చిరంజీవి గారూ… ఫొటో సెష‌న్ నిలుపుద‌ల చేయాల‌ని గట్టిగా కోరారు. ఒక‌వేళ ఫొటో సెష‌న్ నిలుపుద‌ల చేయ‌క‌పోతే త‌న‌కు సెల‌వు ఇప్పించాల‌ని, వెళ్లిపోతాన‌ని లేచి నిల‌బడ్డారు. దీంతో ఆయ‌న‌కు కొంద‌రు స‌ర్దిచెప్పి కార్య‌క్ర‌మంలో కొన‌సాగేలా చేశారు. ఆ త‌ర్వాత చిరంజీవి ఎంతో న‌మ్ర‌త‌గా గ‌రిక‌పాటి వ‌ద్దకెళ్లి న‌వ్వుతూ మాట్లాడారు. కానీ చిరంజీవి అభిమానులు మాత్రం గ‌రిక‌పాటిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

గ‌రిక‌పాటిపై మెగా బ్ర‌ద‌ర్ నాగేంద్ర‌బాబు వ్యంగ్య ట్వీట్‌తో మొద‌లైన ట్రోలింగ్ శృతి మించింది. ఇది కాస్త కులాల మ‌ధ్య గొడ‌వ‌గా చిత్రీక‌ర‌ణ‌కు గురైంది. ఈ నేప‌థ్యంలో గ‌రిక‌పాటి వివాదంపై చిరంజీవి ఇవాళ మీడియా స‌మావేశంలో స్పందించారు. 

గ‌రిక‌పాటి పెద్దాయ‌న‌గా అభివ‌ర్ణించి గౌర‌వాన్ని చాటుకున్నారు. అంతేకాదు, గ‌రిక‌పాటి గొప్ప వ్య‌క్తి అన్నారు. త‌న‌పై గ‌రిక‌పాటి వ్యాఖ్య‌ల‌ను చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పి… వివాదానికి ముగింపు ప‌లికారు. ఇప్ప‌టికైనా చిరంజీవి అభిమానులు గ‌రిక‌పాటిని విడిచిపెడ్తారో లేదో చూడాలి.