ఒక పార్టీని.. ఒక రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారు.. అంటే దాని అర్థం వారు యావత్తు రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేస్తారని! అంతేతప్ప, ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి లాంటి సర్వాధికారాలు నిర్వహించే కీలక పదవుల్లో ఉండే ఒకరిద్దరు నాయకులు తమ నియోజకవర్గాలను మాత్రం స్వర్గతుల్యంగా అభివృద్ధి చేసుకుంటారని కాదు.
ఈ సంగతి సాంకేతికంగా మనందరికీ కూడా తెలుసు. కానీ నాయకులు ప్రతి సందర్భంలోనూ నోరు జారి తమ ఆలోచనల్లో పక్షపాత బుద్ధి ఉన్నదనే సంకేతాలను ప్రజల్లోకి పంపుతూ ఉంటారు. తాజాగా మునుగోడు ఉపఎన్నిక బరిలో టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కల్వకుంట్ల తారక రామారావు కూడా అలాంటి పనే చేశారు. రాజకీయాలలో ఈ పదప్రయోగం కొత్త కాదు గాని దీని గురించి ప్రజల్లో చర్చ జరగవలసిన అవసరం లేనిది కూడా కాదు.!!
ఇంతకూ తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారంటే.. మునుగోడులో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గనుక ఆ నియోజకవర్గాన్ని ఆయన దత్తత తీసుకుంటారట. అలా దత్తత తీసుకోవడం ద్వారా నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి బాటలు వేస్తాను అన్నట్లుగా కేటీఆర్ ప్రజలను ఊరించే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే కేటీఆర్ తన సొంత నియోజకవర్గాన్ని, దత్తత నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం తప్ప రాష్ట్రంలోని తతిమ్మా నియోజకవర్గాలను ఎప్పటికీ పట్టించుకోరా అనే ప్రశ్న ఎదురైతే ఆయన ఏం సమాధానం చెబుతారు.? ‘గెలిపిస్తే దత్తత తీసుకుంటాను’ అనే పదం మునుగోడు ప్రజలకు ఎర వేస్తున్నట్టుగా కనిపించడం లేదా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
నామినేషన్ తర్వాత సభలో మాట్లాడుతూ కేటీఆర్ తమ ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కూడా అనేక విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో ఆయన మునుగోడు అభివృద్ధికి ఏం చేశారు అని ప్రశ్నించారు. అధికారం వీళ్ళ చేతుల్లో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇన్నాళ్లు పనిచేసిన రాజగోపాల్ రెడ్డి ఏం చేశారు అని ప్రశ్నిస్తే ప్రజలు ఏం జవాబు చెప్పగలరు?
ఇదే ప్రశ్న.. ప్రజలు కూడా అడగగలరని కేటీఆర్ కు అనిపించిందో ఏమో తెలియదు గానీ… ఆ వెంటనే తన మాటలను సరిదిద్దుకుంటూ తన నియోజకవర్గానికి ఫలానా పని కావాలి అని ఏనాడైనా సరే జిల్లా మంత్రి దగ్గరకు వెళ్లారా అని చాకచక్యంగా సర్ది చెప్పుకున్నారు.
ఒకవైపు తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా అనేకమార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఫలం దక్కలేదని రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో… ‘నియోజకవర్గ పనులు కోసం జిల్లా మంత్రిని కలిసారా’ అని కేటీఆర్ అడగడమే తమాషా! అయినా అధికారం కట్టబెట్టింది ప్రజలా లేదా ఎమ్మెల్యేలా..? ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఆయా జిల్లా మంత్రుల వద్దకు వచ్చి తమ తమ నియోజకవర్గాలకు ఫలానా పనులు కావాలి.. దయపెట్టండి మహాప్రభో అంటూ దేహీమని అడిగితే తప్ప ఈ పాలకులు కరుణించరా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.
కేటీఆర్ మాటల్లోని మర్మం అలాగే కనిపిస్తోంది. చాకచక్యంగా ఎదుటి వాడి మీదకు నెపం నెట్టేసే ముందు.. తమ మీదకు ఎన్ని విమర్శలు వస్తాయో కేటీఆర్ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ముందుకు సాగితే మంచిది.