జనసేనాని పవన్‌కల్యాణ్ ఏపీలో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాలంటే ఏం చేయాలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఉచిత సలహాలిచ్చారు. తన పార్టీ ఎదుగుదల గురించి కాకుండా, పక్క పార్టీలు ఏం చేయాలో నారాయణ తరచూ చెబుతూ వుంటారు.
తాజాగా పవన్‌కల్యాణ్ ఎలా వుండాలి? ఎలా వుండకూడదనే సంగతిని నారాయణ చెప్పడం విశేషం. విజయవాడలో సీపీఐ జాతీయ సమావేశాల్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే ఏపీలో పవన్‌కల్యాణ్ ప్రత్యామ్నాయ నాయకుడిగా అవతరించగలరన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పవన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలా ప్రభావం చూపలేకపోయారు. బీజేపీని వీడి టీడీపీతో పవన్‌కల్యాణ్ పొత్తు పెట్టుకోవాలనేది నారాయణ ఆకాంక్ష. తన పార్టీ గురించి కూడా ఆయనకు పట్టింపు లేదు.
ఎలాగైనా చంద్రబాబును సీఎం పీఠంపై కూచోపెట్టేందుకు బీజేపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు నారాయణ ఉత్సాహం చూపుతున్నారు. వైసీపీపై విమర్శలు చేయడంలో నారాయణ ముందు వరుసలో ఉంటారు. బీజేపీకి వైసీపీ ఎందుకు సహకరిస్తున్నదో అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజలతో వుంటారో, బీజేపీతో వుంటారో జగన్ తేల్చుకోవాలని ఆయన హెచ్చరించడం గమనార్హం. కానీ బీజేపీతో చంద్రబాబు సన్నిహితంగా వుంటే మాత్రం ఈయనకు హ్యాపీ. ఇదేం లాజిక్కో అర్థం కాదు.