విజ‌యసాయి తన మురికి కడుక్కోవాలి

ఎంపీ విజ‌యసాయి రెడ్డి ముందు తన చేతులకు అంటుకున్న మురికి కడుక్కుంటే మంచిది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. విశాఖలో భూముల వివాదంపై ఎంపీ విజ‌యసాయి వివరణ ఇస్తూ,…

ఎంపీ విజ‌యసాయి రెడ్డి ముందు తన చేతులకు అంటుకున్న మురికి కడుక్కుంటే మంచిది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. విశాఖలో భూముల వివాదంపై ఎంపీ విజ‌యసాయి వివరణ ఇస్తూ, బిల్డర్ గా ఎంవివి సత్యనారాయణ చేసిన ఓ డీల్ గురించి కూడా ప్రస్తావించారు. నిజానికి ఈ డీల్ గురించి అంతకు ముందే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. విశాఖ ఎంపీ జాక్ పాట్ అంటూ ఈ కథనం వచ్చింది. దాన్నే విజ‌యసాయి కూడా ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా ఎంవివి ని ఇంటర్వూ చేసింది. ఆ సమయంలో ఎంవివి మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 99శాతం బిల్డర్ కు ఒక్క శాతం లాండ్ ఓనర్లకు. అనే డీల్ ను ఎంవివి కుదుర్చుకున్నారు. దాని మీద అభ్యంతరాలు వచ్చాయి. దానినే విజ‌యసాయి కూడా తన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు.

దీనికి సంబంధించిన ప్రశ్నలకు ఎంవివి సమాధానం ఇస్తూ, ఎంపీ కాక ముందే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, ఆ డీల్ 2017 లో కుదిరినది అని, అది కూడా అప్పటి లోక్ అదాలత్ లో జ‌రిగిన సెటిల్ మెంట్ అని చెప్పారు. తనది ప్రభుత్వ భూముల వ్యవహారం కాదని, పూర్తిగా ప్రయివేటు భూముల వ్యవహారం అని, దసపల్లా భూములకు దీనికి విజ‌యసాయి ముడిపెట్టడం సరి కాదని ఎంవివి అన్నారు.

అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ మీద వైకాపా పోరాటం చేసిందని, అలాంటిది విజ‌య సాయి కుమార్తె, అల్లుడు విశాఖలో అదే విధంగా భూములు ఎలా కొనుగోలు చేస్తారని ఎంవివి ప్రశ్నించారు. అసలు ఇద్దరు ఎంపీలకీ మధ్య ఎందుకు వివాదం వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తాను గులాంగిరీ చేయనని, ఆత్మాభిమానం వున్న వ్యక్తిని అని, పైగా విజ‌యసాయి కుమార్తే, అల్లుడు భూముల వ్యవహారంలో వార్తల వెనుక తాను వున్నానని అనుమానిస్తున్నారని అన్నారు. అందువల్లే ఈ విబేధాలు అని ఎంవివి చెప్పకనే చెప్పారు.

తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వస్తానని విజ‌యసాయి అనడం పై వ్యాఖ్యానిస్తూ, మీడియాలోకి వస్తా అంటారు. రియల్ ఎస్టేట్ అంటారు. ఇలా ఆఖరికి కొత్త పార్టీ అని కూడా అంటారేమో అంటూ సెటైర్ వేసారు ఎంవివి.