కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఇద్దరు జడ్జీలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును ఒక జడ్జీ సమర్ధిస్తే మరొ జడ్జీ వ్యతిరేకించారు.
హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగించేలాని ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతిపాదించారు. మరోవైపు జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు వ్యతిరేకంగా తీర్పు రాశారు. హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరువురి జడ్జీల తీర్పు వెలువడిన నేపథ్యంలో సీజేఐ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముంది.
గత సంవత్సరం కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు యువతులను ప్రవేశాన్ని కళాశాలోకి నిరాకరించడంతో చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.