భిక్షాటన – అంటరానితనం

భిక్షాటన గురించి నిన్న ఓ చిన్న చర్చ చేయాల్సి వచ్చింది. చేతి వృత్తులు ఆధారంగా ఉన్న కులాల తరహాలోనే భిక్షాటన కూడా వృత్తిగా చేసుకుని జీవించే కులాలు ఉన్నాయి.  Advertisement ఈ దేశంలో ఉన్న…

భిక్షాటన గురించి నిన్న ఓ చిన్న చర్చ చేయాల్సి వచ్చింది. చేతి వృత్తులు ఆధారంగా ఉన్న కులాల తరహాలోనే భిక్షాటన కూడా వృత్తిగా చేసుకుని జీవించే కులాలు ఉన్నాయి. 

ఈ దేశంలో ఉన్న అనేకానేక వైకల్యాలలో భిక్షాటన కూడా కులవృత్తి కావటం ఒక వైకల్యమే. 

అయితే విచిత్రం ఏమంటే భిక్షాటన కూడా అంటరానితనాన్ని పాటిస్తుంది. ఇదేదో నేను విస్తృతంగా తిరిగో, ఎవరో చెపితే వినో, లేదా పుస్తకాల్లో చదివో చెప్పేది కాదు. స్వయంగా బాల్యం నుండి చూసింది, నా స్వానుభవం.

భిక్షాటన చేస్తూ బ్రతికే కులాలు అంటరానితనాన్ని ఖచ్చితంగా పాటించేవి. 

ఈ భిక్షాటన కులాలు ఊరూరూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అందులో కళ కూడా ఉంటుంది. పామును ఆడించడమో, కోతిని ఆడించడమో, గంగిరెద్దును ఆడించడమో, డప్పు వాయించడమో, గారడీ ప్రదర్శన చేయడమో, పాటలు, పద్యాలు పాడడమో, మాటలు చెప్పడమో, ఇతిహాసాల పాత్రలు (శివుడు, అర్ధనారీశ్వర, యమధర్మరాజ వంటివి) ధరించడమో… ఇలా అనేక రూపాల్లో భిక్షాటన ఉండేది.

ఇంకో రకం ఉన్నారు. మగాడు కత్తితో శరీరం కోసుకుంటూ ఉంటాడు. కొరడాతో వీపు మీద కొట్టుకుంటూ ఉంటాడు. ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటుంది. భార్య మాత్రం ఓ చిన్న డోలు వాయిస్తూ, భిక్షం స్వీకరిస్తూ ఉంటుంది. అలాగే మరో రకం – వీళ్ళను “మొండి” అనేవారు. వీళ్ళు గుమ్మంలోనే కూర్చుంటారు. భిక్షం వేయకపొతే మూత్రం పోయడంతో మొదలేసి చివరికి వాంతులు కూడా గుమ్మంలోనే చేస్తారు. అంత చండాలం చేసేవారు.      

వీరు ఊరి మొదట్లో భిక్షాటన ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కల్లా ఆ ఊరు పూర్తి చేసుకుని, భోజనం చేసి, కాస్త విశ్రాంతి తీసుకుని ఆ రాత్రికో లేదా తెల్లారి ఉదయానికో ఆ పక్క ఊరు చేరుకుంటారు. 

ఇక విషయం ఏమంటే ఊరికి ఆ చివరో, ఈ చివరో దళిత వాడాలే ఉంటాయి. మధ్యాహ్నానికల్లా భిక్షాటన పూర్తి చేయాలి కాబట్టి తొలికోడి కూసినప్పుడే భిక్షాటన మొదలేస్తారు. అంటే దళితులు నిద్ర లేచీ లేవక ముందే వాళ్ళ ఇళ్ళముందు భిక్షాటన మొదలవుతుంది. అప్పుడు మొదలెడితే కానీ మధ్యాహ్నం భోజనం సమయానికి ఊరంతా తిరగలేరు. అది వారి పరిస్థితి. కానీ దళితుల పరిస్థితి ఏంటంటే కళ్ళు తెరిచీ తెరవక ముందే వీళ్ళను చూడాలి. భిక్షం వేయాలి. 

భిక్షం ఏ బియ్యమో, గోధుమలో, జొన్నలో, మొక్కజొన్నలో, పప్పు ధ్వన్యాలో వేయాలి. లేదా డబ్బులు వేయాలి. అంతే కానీ అన్నం, కూరలు వేస్తే తీసుకునేవారు కాదు. “మీ అన్నం మేం తింటామా?” అంటూ ఎదురు ప్రశ్నించేవారు. అయితే ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు అన్నం వేస్తే మాత్రం తీసుకునేవారు. దళిత కూలీల అన్నం ముట్టుకునేవారు కాదు. 

కొందరు అంటే జంగం దేవర, బుడబుక్కల, బూడిద సాయిబు (వీళ్ళనేమంటారో తెలియదు. నా చిన్నప్పుడు అలా పిలిచేవారు. ఒళ్ళంతా బూడిద పూసుకుని, చేతిలో గంట పట్టుకుని తిరుగుతూ కనిపించేవారు.) ఇలాంటి వారు అర్ధరాత్రి భిక్షాటనకు వచ్చేవారు. గంట కొడుతూ గుమ్మంలో నిలబడేవారు. అప్పుడు లేచి వారికి భిక్షం వేయకపోతే ఊరికి, కుటుంబానికి చెడు జరుగుతుందని, వాళ్ళు శపిస్తారని భయపడేవారు. భిక్షం వేయని వారి గుమ్మంలో పసుపు, కుంకుమ బొట్లు పెట్టిన నిమ్మకాయలు వదిలి పోయేవారు. అందువల్ల అర్ధరాత్రి అయినా నిద్రలేచి భిక్షం వేయాల్సి వచ్చేది. 

కొంత కాలానికి మా నాన్న ఇలాంటి వారిని తరిమేయడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి ఈ గోలేంటి. మీ బూడిద మొహాలు ఏంటి. తెల్లారిన తర్వాత రావొచ్చుగా అంటూ కర్ర పట్టుకుని వెంటపడేవారు. ఆ తర్వాత కొంత కాలానికి అర్ధరాత్రి, తెల్లవారుఝామున భిక్షాటన తగ్గిపోయింది. 

వీటన్నిటిలో కాస్త మనసు చివుక్కుమనే సందర్భం ఏమంటే … అంటరానితనం. దళితుల ఇళ్ళల్లో అన్నం, కూర భిక్షంగా స్వీకరించకపోవడం. సంక్రాంతికి, ఇతర పండగలకు వండుకునే అరిసెలు, చక్రాలు వంటి తినుబండారాలు కూడా తీసుకునేవారు కాదు. 

మరీ దుర్మార్గం ఏమంటే వాళ్ళ చేతిలో ఉన్న సంచికి దళితులు తమ చేతులు తగలకుండా భిక్షం వేయాలి. పొరపాటున చేయి తగిలితే వాళ్ళు కోప్పడేవారు. తమ చేతిలో ఉన్న నెమలి పించం, లేదా వేప మండలతో ఆ సంచిని శుద్ధి చేసుకునేవాళ్ళు. 

ఇవన్నీ బాల్యం నుండి చూస్తూ పెరిగిన వాణ్ణి. దళిత కుటుంబాల్లో పుట్టిన చాలా మందికి ఇవి అర్ధం అయ్యే అనుభవాలే కావచ్చు. 

పైనుంచి చూసే వారికి “మరీ ఇంత ఉంటుందా” అనిపించొచ్చు. బళ్ళో నీళ్ళు తాగిన నేరానికి పసిపిల్లాణ్ణి కొట్టి చంపిన సంఘటన విని ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. అగ్ర వర్ణాల వారి వీధిలో నడిచినందుకు ఓ దళితుణ్ణి చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన రెండు, మూడు నెలల క్రితమే జరిగింది. 

ఇది ఈ దేశ వాస్తవం. ఇది నిజం. “ఇలాంటివన్నీ ఇంకా ఎక్కడ ఉన్నాయి” అని నిట్టూర్పులు విడిచేవారు అప్పుడప్పుడు పత్రికల్లో మొదటి పేజీలు కాక లోపలి పేజీల్లో సింగిల్ కాలం వార్తలు చూస్తుంటే నిజాలు తెలుస్తాయి. ఇవన్నీ ఇంకా సజీవంగానే ఉన్నాయి అని అర్ధం అవుతుంది.  

Facebook post by దారా గోపి