ఏపీలో ఇపుడు పోటీ రాజకీయం నడుస్తోంది. ఇప్పటిదాకా అమరావతి రాగాలాపన చేసి అలసిపోయిన టీడీపీ వర్గాలు రాజధాని వికేంద్రీకరణ ఇష్యూతో ఉత్తరాంధ్రా పాట పాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ విధంగా ఉత్తరాంధ్రా వైపుగా టీడీపీని మళ్ళించగలిగామని చెబుతున్నారు.
మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు అయితే విశాఖ రాజధాని విషయంలో ఉత్తరాంధ్రా ప్రజలలో చైతన్యం బాగా పెరిగింది అని అంటున్నారు. దీంతో టీడీపీలో గుబులు మొదలైంది అని చెబుతున్నారు. ఇపుడు చంద్రబాబు విశాఖ వైపుగా తన ఫోకస్ పెడుతున్నారుట. ఈ నెల 20 తరువాత చంద్రబాబు విశాఖ టూర్ ని ఫిక్స్ చేసుకున్నట్లుగా టీడీపీ వర్గాల సమాచారం.
చంద్రబాబు విశాఖలో కొన్ని రోజుల పాటు మకాం వేసి సభలూ సమావేశాలు పెట్టి టీడీపీ హయాంలో తాము ఏం చేశామన్నది వివరిస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఏమీ చేయలేదని ఎటూ బాబు విమర్శలు చేస్తారని అంటున్నారు. విశాఖ పొలిటికల్ ప్రయారిటీని గుర్తించిన చంద్రబాబు ఇక్కడకు తరచూ రావాలని కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని విశాఖకు వస్తున్నారు అన్నది ప్రచారం అయితే సాగుతోంది కానీ ఆచరణలో మాత్రం అది ఎందుకో లేట్ అవుతోంది. బాబు మాత్రం జగన్ కంటే నాలుగడుగులు తాను ముందుంటాను అని చెబుతూ చలో విశాఖ అంటున్నారుట.
కొంపదీసి బాబు విశాఖలో ఒక ఇల్లు కూడా తీసుకుని నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటారా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. బాబుని అమరావతి వైపు నుంచి విశాఖ దిశగా నడిపించిన ఘనత మాత్రం మాదే అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
బాబు విషయం అలా ఉంచినా జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ తో విశాఖ త్వరగా వస్తేనే విశాఖ రాజధాని అన్న నినాదానికి సార్ధకత ఉంటుందని అంతా అంటున్నారు.