స్వంత విడుదల అంటే హిట్టేనా?

మెగాస్టార్ తన గాడ్ ఫాదర్ సినిమాను ఎలాగైనా హిట్ అనిపించుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు. మీడియా జ‌నాలతో ముచ్చట్ల సంగతి, అలా వుంచితే సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయని, పైగా సినిమా అమ్మలేదు..స్వంత విడుదల అని…

మెగాస్టార్ తన గాడ్ ఫాదర్ సినిమాను ఎలాగైనా హిట్ అనిపించుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు. మీడియా జ‌నాలతో ముచ్చట్ల సంగతి, అలా వుంచితే సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయని, పైగా సినిమా అమ్మలేదు..స్వంత విడుదల అని నిర్మాతల చేత స్టేట్ మెంట్ లు ఇప్పిస్తున్నారు. ఇది చాలక తాను కూడా మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తనేమీ మిడ్ రేంజ్ హీరో కాదు. వస్తున్న కలెక్షన్లు చూసి మురిసిపోవడానికి. 50 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే టాప్ హీరో. కలెక్షన్లు కూడా ఆ రేంజ్ లో వుండాలి కదా?

పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ తొలి ఒకటి రెండు రోజుల్లో నైజాంలో ఎంత వసూలు చేసిందో ఇప్పటి వన్ వీక్ లో గాడ్ ఫాదర్ అంత వసూలు చేసింది. కార్తికేయ 2 లాంటి చిన్న సినిమా కుమ్మేసింది. కానీ గాడ్ ఫాదర్ దాన్ని దాటగలదా? అమ్మకపోయినంత మాత్రాన హిట్ అవుతుందా? బయ్యర్లకు బదులు నిర్మాత నష్టపోతారు. ముగ్గురు నిర్మాతల్లో తన తనయుడు రామ్ చరణ్ కూడా ఒకరు.

నైజాంలో మెగాస్టార్ అంటే జ‌స్ట్ పది నుంచి పదిహేను కోట్ల హీరోయేనా? విశాఖలో జ‌స్ట్ అయిదారు కోట్ల హీరోయేనా? మెగాస్టార్ సినిమా జ‌స్ట్ డిస్ట్రిబ్యూషన్ కు ఇస్తామంటే నెల్లూరు నుంచి యాభై లక్షలు అడ్వాన్స్ రావడం కష్టమైంది. ఇదేనా ఆయన సినిమా మీద వున్న నమ్మకం? మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాకు బయ్యర్లు ఫిక్స్ డ్ గానే వున్నారు. ఎందుకంటే మైత్రీ బ్యానర్ కనుక. కానీ ఇప్పటి వరకు ఏ రేషియోలో ఇవ్వాలన్నది ఫిక్స్ చేసుకోలేక‌పోతున్నారు.

మహేష్, బన్నీ లాంటి హీరోల సినిమాలు నైజాంలో నలభై నుంచి యాభై కోట్ల మేరకు పలుకుతుంటే గాడ్ ఫాదర్ సినిమా 20 కోట్లకు ఇచ్చినా అయిదు నుంచి ఎనిమిది కోట్ల దూరంలో ఆగిపోతుంది అని వార్తలు వినిపిస్తుంటే హిట్ అని ఎలా అనగలరు? పైగా ఇకపై చేసేవన్నీ ఇలాంటి సీరియస్ రోల్స్ కాదని, పక్కా డ్యాన్స్ లు, ఫైట్ లు, అల్లరి వుంటాయని మెగాస్టార్ అంటున్నారు.

అంటే ఆచార్య, గాడ్ ఫాదర్ ల్లో చేసిన సీరియస్ రోల్స్ ఫ్యాన్స్ కు నచ్చలేదని ఆయన భావిస్తున్నారా? మరి ఆచార్య సినిమాలో కూడా డ్యాన్స్ లు చేసారు. ఫైట్లు కూడా చేసారు. మెగాస్టార్ గమనించాల్సింది వేరే వుంది. ఎంతటి గొప్ప నటుడు అయినా ఓ కాలపరిమితి అంటూ వుంటుంది. కొత్త నీరు వస్తూ వుంటుంది. కొత్త తరం కొత్త సినిమా చూపిస్తూ వుంటుంది. ఫ్యాన్స్ కు బాస్ అనీ మెగాస్టార్ అనీ అభిమానం వుండొచ్చు. వుంటుంది..వుండాలి కూడా.

కానీ అలా అని వాళ్లు కూడా పాత రుచులే చూస్తూ వుండలేరు కదా? కొత్తదనం నలువైపుల నుంచీ కమ్ముకు వస్తోంది అన్నది గమనించాలి. అందుకే శోభన్ బాబు లాంటి వాళ్లు పరుగాపడం ఓ కళ అని భావించి చటుక్కన ఆగిపోయారు. కృష్ణ లాంటి క్రేజ్ వున్నవారు ఏవేవో ప్రయత్నాలు చేసి, ఆ తరువాత ఆపేసారు.

తనది ఏ దారి, ఎలా వెళ్లాలి అన్నది మెగాస్టార్ నే డిసైడ్ చేసుకోవాలి. అదే సమయంలో సినిమా మీద ఖర్చును తగ్గించుకోవాలి. తన వైపు నుంచి భారం పడకుండా చూసుకోవాలి. ఆ విషయంలో పోల్చుకుంటే సీనియర్లు బాలయ్య, నాగ్, వెంకీ లు చాలా తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. అందుకే ఈ దిశగా కూడా మెగాస్టార్ ఆలోచిస్తే, అప్పుడు సినిమా అమ్మినా ఫరవాలేదు. కలెక్షన్లు ఈ రేంజ్ లోనే వున్నా ఫరవాలేదు.