హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేసిన తొలి రెండు చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకున్నాయి.
లేటెస్ట్ గా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తొలి చిత్రంగా `నాంది` వంటి డిఫరెంట్ మూవీని నిర్మించి.. సూపర్ హిట్ కొట్టిన నిర్మాత సతీశ్ వర్మ తన ప్రొడక్షన్ నెం.2గా గణేశ్ బెల్లంకొండ సినిమాను నిర్మిస్తున్నారు.
దర్శకుడు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్‌కు రాకేశ్ స్క్రీన్ ప్లే రాయగా, కథను అందించిన ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య మాటలు, పాటలను కూడా రాస్తున్నారు. ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా, హీరో అల్లరి నరేశ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనిత్ సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్.