తమ చేతిలో పెన్నుంది కదా అని.. ఈనాడు తమకు తోచింది రాసి పారేస్తుంది. ఆధారాలు చూపగలిగినవి ఒకటీ అరా దొరికితే చాలు.. ఆధారాలతో నిమిత్తం లేకుండా వందల సంఖ్యలో ఆరోపణలను, పుకార్లను వండి వార్చేస్తుంది. తమకున్న స్థాయికి.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారి స్థాయిలో సీఐడీ కేసులు పెట్టడం సాధ్యం కాదు కదా.. అని అహంకారంతో విర్రవీగుతుంది. అంతే.. వండి వార్చేయడం వరకే వారి పని.. ఆ తర్వాత.. ఆ వంటకాల్ని పూర్తిగా కుళ్లిపోయే దాకా రాష్ట్రమంతా వాసన కొట్టేదాకా ప్రచారం చేస్తూ ఉండడం చంద్రబాబు పని! ఇప్పుడు అదే జరుగుతోంది.
విశాఖలో భూదందాలు జరుగుతున్నట్లుగా అడ్డగోలుగా ఈనాడులో వరుస కథనాలు వస్తున్నాయి. ఆధారాల సహా వారు నిందలు వేయగలుగుతున్నది.. దసపల్లా భూముల గురించి మాత్రమే. అయితే ఈ భూములను ఎవరు కొన్నారు.. వారి వెనుక గానీ, ముందుగానీ వైసీపీ నాయకుల పాత్ర ఎంత? అనేది నిదానంగా తేలుతుంది.
తాజాగా గ్రేట్ ఆంధ్ర కథనాన్ని కాపీ కొట్టి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దందా గురించి కూడా ఆధారాలసహా ప్రచురించారు. అయితే ఈ దందా జరిగినదే 2018లో! అప్పట్లో ఆయన ఆ దందాను ఆ రీతిగా నడిపించడానికి ఎందరు తెలుగుదేశం పెద్దలను ఏ రీతిగా ప్రసన్నం చేసుకున్నారో.. ఎవరెవరికి ఏమేం ముట్టజెప్పారో.. అప్పట్లో పాలన సాగిస్తున్నవాళ్లంతా ఎందుకు కళ్లు మూసుకుని కూర్చున్నారో తెలియదు.
ఇవి తప్ప ఆధారాల సహితంగా చెబుతున్న భూఅక్రమాలు చాలా చాలా తక్కువ. కాకపోతే.. ఈనాడు పాసింగ్ స్టేట్మెంట్ లాగా.. ‘‘రాష్ట్రంలోని వైకాపా నాయకులు అందరూ వచ్చి విశాఖ మీద వాలిపోతున్నారు.. భూదందాలు చేస్తున్నారు’’ అని రాసిపారేసింది. అంతే ఆ పాటను చంద్రబాబు అందుకున్నారు.
విశాఖను రాష్ట్రంలోని అందరు వైసీపీ నాయకులూ కలిసి దోచేసుకుంటున్నారంటూ వంతపాడడం మొదలుపెట్టారు. వైకాపీ పెద్దలు విశాఖను మింగేశారంటున్నారు. సేవ్ ఉత్తరాంధ్ర ఉద్యమం రావాలంటున్నారు. కనీసం చంద్రబాబునాయుడైనా.. రాష్ట్రం మొత్తం నుంచి ఎందరు వైసీపీ నేతలు వచ్చి విశాఖలో భూదందా సాగించారో ఆధారాల సహా లెక్కలు చెప్పగలరా? అనేది పెద్ద ప్రశ్న.
ఈనాడు రాతల్లో ఏది చెబితే అది తన కూతల్లో ప్రదర్శించడం కాదు.. చంద్రబాబునాయుడు తన సొంత విచక్షణ ఉపయోగించకపోతే.. రాజకీయాల్లో మళ్లీ దెబ్బతింటారు.