ఆధునిక కాలంలో ఇలాంటివి ఇంకానా!

ఇది చిన్న విష‌య‌మే కావ‌చ్చు. కానీ అధికారుల లెక్క‌లేని త‌నాన్ని ప్ర‌తిబింబిస్తోంది. ప్ర‌తిదీ ఇప్పుడు ఆధార్‌తో ముడిప‌డిన జీవితాలు మ‌న‌వి. అలాంటిది ఆధార్ లేక‌పోతే ఏ ప‌నీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి. అలాంటిది ఓ గ్రామం…

ఇది చిన్న విష‌య‌మే కావ‌చ్చు. కానీ అధికారుల లెక్క‌లేని త‌నాన్ని ప్ర‌తిబింబిస్తోంది. ప్ర‌తిదీ ఇప్పుడు ఆధార్‌తో ముడిప‌డిన జీవితాలు మ‌న‌వి. అలాంటిది ఆధార్ లేక‌పోతే ఏ ప‌నీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి. అలాంటిది ఓ గ్రామం అస‌లు ప్ర‌భుత్వ రికార్డుల్లో న‌మోదు కాక‌పోవ‌డం, ఆ చిన్న గ్రామ ఆదివాసీ గిరిజ‌న బాల‌బాలిక‌ల‌కు బ‌ర్త్‌, ఆధార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం… ఈ దుస్థితికి పాల‌నా వ్య‌వ‌స్థ సిగ్గు ప‌డాల్సిన విష‌యం. ప్ర‌స్తుత ఆధునిక యుగంలో కూడా ఇలాంటి వాటి గురించి వినాల్సి రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో నేరేడుబంద అనే కుగ్రామ దీన‌గాథ ఇది. ‘చేతులు జోడించి వేడుకుంటున్నాం. జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో మాకు ఆధార్‌ కార్డులు ఇప్పించాలి’ అని గిరిజన పిల్లలు అభ్య‌ర్థించ‌డం మ‌న‌సున్న అధికారుల‌ను క‌దలించ‌కుండా ఉండ‌దు.

నేరేడుబంద అనే కుగ్రామంలో 25 కుటుంబాలున్నాయి.  ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోలేదంటే… ఎంత మారుమూల ఉన్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక్కడ జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వ‌డం లేదు. దీనికి కార‌ణం… వీరంతా ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దే పుట్ట‌డం. ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో వీరి పుట్టుక వివ‌రాలు నమోదు కాకపోవడంతో బర్త్‌ సర్టిఫికెట్ల‌కు నోచుకోలేదు. దీంతో ఆధార్‌ కార్డులు జారీ చేయడం సమస్యగా మారింది.

సాధార‌ణంగా ఇంటి వ‌ద్ద జ‌న్మిస్తే…ఆ ఊరి లేదా పంచాయ‌తీ ప‌రిధిలోని అంగ‌న్‌వాడీ సిబ్బంది జ‌న‌న వివ‌రాల‌ను న‌మోదు చేసుకుంటారు. ఈ స‌మాచారాన్ని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శికి ఇస్తారు. అప్పుడు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి వారికి బ‌ర్త్ స‌ర్టిఫికెట్లు జారీ చేయ‌డం ఆన‌వాయితీ. ఇక్క‌డ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

మండల ప‌రిధిలోని గడుతూరు పంచాయతీ కేంద్రానికి, అలాగే రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి అడిగిగే… నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్ల‌ల‌కే కాదు తల్లిదండ్రులకు కూడా ఆధార్‌ కార్డులు లేవు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాల‌కు ఆ కుగ్రామ ప్ర‌జ‌లు నోచుకోలేదు. ఇప్ప‌టికైనా జిల్లా ఉన్న‌తాధికారులు ఆ గ్రామ ఆవేద‌న‌ను తీర్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.