కోవిడ్-19 థర్డ్ వేవ్ గురించి అధ్యయనాన్ని చేసి, అందుకు సంబంధించిన పూర్తి అంచనాలను ప్రధానమంత్రి కార్యాలయానికి అందించింది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం)కు సంబంధించిన నిపుణుల కమిటీ.
కేంద్ర హోం శాఖ ఆదేశాలనుసారం దేశంలో కరోనా మూడో వేవ్ ప్రవర్తన గురించి ఈ అధ్యయనం జరిగినట్టుగా తెలుస్తోంది. దీని సారాంశం ఏమిటంటే.. కరోనా మూడో వేవ్ ఉండవచ్చు. అయితే అది ఏ స్థాయిలో అనే నంబర్లనేమీ ఈ అధ్యయనం లెక్క గట్టలేదు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మూడో వేవ్ పిల్లలు- టీనేజర్లపై ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు అంటూ ఈ అధ్యయనం మరోసారి చెప్పడం!
గతంలో ఈ తరహా అంచనాలే వ్యక్తం అయ్యాయి. మూడో వేవ్ ప్రధానంగా పిల్లలపై ప్రభావం ఉండవచ్చని కొందరు అంచనా వేశారు. అయితే ఆ విషయంలో సహేతుకత లేదని పలువురు వాదించారు. ప్రధానంగా సెకెండ్ వేవ్ లో కూడా పిల్లలు, టీనేజర్లు కొందరు కరోనా బారిన పడిన వైనాన్ని ప్రస్తావించారు.
జనాభా నిష్ఫత్తికి అనుగుణంగా సెకెండ్ వేవ్ లో చిన్నారుల్లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు కొత్తగా థర్డ్ వేవ్ లోనే పిల్లలకు కరోనా వస్తుందనేది అర్థవంతమైన వాదన కాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్ఐడీఎం నిపుణుల కమిటీ మాత్రం.. మరోసారి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిస్తూ తన నివేదికను ఇచ్చింది.
చిన్న పిల్లల వైద్యుల సేవలను ప్రభుత్వం సమీకృతం చేసుకోవాలని, ఐసీయూలతో సహా చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను మెరుగు పరుచుకోవాలని ఈ నివేదికలో సూచించారు. అక్టోబర్ లో థర్డ్ వేవ్ పీక్ స్టేజీకి చేరవచ్చని ఈ అధ్యయనం అంచనా వేయడం గమనార్హం. ప్రస్తుతం కూడా కరోనా కేసులు వస్తున్నాయి.
ఇప్పుడు వస్తున్న కేసుల్లో 50శాతానికి పై వాటా కేరళకే చెందుతోంది. ఈ పరిణామాల్లో మరో నెలన్నర రోజుల్లో మూడో వేవ్ పతాక స్థాయికి వెళ్లవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఆ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగు రీతిలో సమాయత్తం కావాలని ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ఈ నివేదిక.