నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గెలుస్తామనే నమ్మకాన్ని కలిగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు. అప్పుడే టికెట్ ఇవ్వాలా? వద్దా? అనేది తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పడం విశేషం. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే పార్టీలు చూస్తున్నాయి. రాజధాని అంశంపై ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబుకు అంతుచిక్కడం లేదు. కేవలం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌తో ముందుకెళితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎలా తీసుకుంటాయో అనే ఆందోళన ఆయనలో లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజానీకాన్ని తమకు అనుకూలంగా చైతన్యపరచాలని ఆయన తమ పార్టీ నేతలకు సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు ముందడుగు వేయాలని చంద్రబాబు సూచించారు. గెలుపుపై తనకు భరోసా కల్పించాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సూచించారు. ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని ఆయన సూచించారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు చూస్తున్నాడని మండిపడ్డారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నిలబడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇలా ప్రతి మాట ఉత్తరాంధ్ర, రాయలసీమలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మాట్లాడ్డాన్ని గమనించొచ్చు. దీన్నిబట్టి ఆయన మనసులో భయం ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎలా అధిగమిస్తారనేది రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి వుంటుంది.