సైరా సినిమా బిగ్ ఫెయిల్యూర్..నిర్మాతగా మెగా ఫ్యామిలీ కి బిగ్ లాస్. ఆచార్య సినిమా మెగాస్టార్ పరువు ఎంత తీయాలో అంతా తీసింది. సన్ అండ్ ఫాదర్ కలిపి నటించిన ఆ సినిమా మీద జరిగినంత ట్రోలింగ్ ఇంతా అంతా కాదు. అందుకే ఈసారి గాడ్ ఫాదర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ముందే వార్తలు వచ్చాయి. అవే జాగ్రత్తలను మెగాస్టార్ కొనసాగిస్తున్నారు.
ఏరియాల వారీ విక్రయించకుండా, ఎంతకు అమ్మాలనుకుంటున్నారో అంత మేరకు అడ్వాన్స్ లు తీసుకుని సినిమాను ఇవ్వడం తొలి జాగ్రత్త. దీని వల్ల బయ్యర్లకు నష్టాలు వస్తే వెనక్కు సైలంట్ గా ఇచ్చుకోవమే. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర 8 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికి అయిదు కోట్లకు కాస్త అటుగా వచ్చింది. అది కూడా జీఎస్టీతో కలిపి అని టాక్. మరో పది రోజుల పాటు సినిమాలు లేవు కనుక మెల్లగా మరో మూడు కోట్లు లాగేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఈ పది రోజులు థియేటర్ల రెంట్ కే చాలా వరకు సరిపోతుంది. పైగా ఖర్చులు వుండనే వుంటాయి. దాదాపు అన్ని ఏరియాలదీ ఇదే పరిస్థితి.
నైజాం పరిస్థితి వేరు. అక్కడ సినిమాను విక్రయించారు. అందువల్ల కనీసం అయిదు కోట్లకు పైగా వెనుక్కు ఇవ్వాలి. యుఎస్ రెండు మిలియన్లు చేయాలి. కానీ అక్కడ ఒక్క మిలియన్ దాటగలిగింది.
బయ్యర్లకు వెనక్కు ఇవ్వాలా? అమ్మారా? అడ్వాన్స్ లా? అన్న సంగతి పక్కన పెడితే 50 కోట్ల మెగా స్టార్ రేంజ్ కు ఈ కలెక్షన్లు అంటే ఏమిటి? అన్నది పాయింట్. అది కూడా సినిమా స్క్రీన్ మీద పడిన దగ్గర నుంచి వీరలెవెల్ లో పాజిటివ్ టాక్ ను వీలయినంతగా స్ప్రెడ్ చేయగలిగితే ఇదీ పరిస్థితి. అదే సినిమా ఏమాత్రం కాస్త అటు ఇటుగా వున్నా? పరిస్థితి ఊహించలేం.
సినిమా విడుదల తరువాత కూడా మెగాస్టార్ అవే జాగ్రత్తలు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియా జనాలను పిలవడం, వాళ్లతో అభిమానంగా వుండడం, తనతో పాటు సినిమా చూపించడం, కలిసి ఫొటొలు దిగడం ఇలా వీలయినంత హడావుడి చేస్తున్నారు. కానీ ఇవన్నీ సినిమా మీద నెగిటివ్ వార్తలను తగ్గిస్తాయేమో కానీ సోషల్ మీడియా మాత్రం నిర్మొహమాటంగా తన పని తాను చేస్తూనే వుంటుంది.
అలా అని సోషల్ మీడియాను లాలించడం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎంత మంది వుంటారో, మిగిలిన హీరోల ప్యాన్స్, న్యూట్రల్ ఫ్యాన్స్ అంత మంది వుంటారు. వారంతా తమకు తెలిసినవన్నీ చాటింపు వేస్తూనే వుంటారు. ఇప్పటికే సోషల్ మీడియా గాడ్ ఫాదర్ ను యావరేజ్ సినిమాల జాబితాలో చేర్చేసింది.
సరే ఈ సినిమాకు అంటే తన ఇంటి నిర్మాత కనుక మెగాస్టార్ బోలెడు పద్దతులు పాటించి జాగ్రత్త పడ్డారు. కానీ రాబోయే సినిమాల విషయంలో వాటి నిర్మాతల స్ట్రాటజీ వారికి వుంటుంది కదా? అప్పుడు మాత్రం సినిమా కచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే.