తెలంగాణలో గ్యాంగ్ రేప్.. టార్గెట్ కేసీఆర్..!

తెలంగాణలో ఇటీవల పబ్బు-గబ్బు కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓవైపు ఇంటర్నేషనల్ సిటీ, పెట్టుబడులకు స్వర్గధామం, నివాసానికి అద్భుతం, కంపెనీలకు వెల్కమ్ అంటూ.. అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. మరోవైపు పబ్బుల్లో డ్రగ్స్ కలకలం పరువు…

తెలంగాణలో ఇటీవల పబ్బు-గబ్బు కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓవైపు ఇంటర్నేషనల్ సిటీ, పెట్టుబడులకు స్వర్గధామం, నివాసానికి అద్భుతం, కంపెనీలకు వెల్కమ్ అంటూ.. అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. మరోవైపు పబ్బుల్లో డ్రగ్స్ కలకలం పరువు తీసేలా ఉంది. తాజాగా అమ్నీషియా పబ్ దగ్గర ఓ మైనర్ బాలికపై కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

మారింది అనడం కంటే.. అలా సంచలనం చేశారు అనడమే కరెక్ట్. ఎందుకంటే.. హైదరాబాద్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని హైలెట్ చేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమ్నీషియా పబ్ ఘటనను ఎవరూ సమర్థించరు కానీ, దాన్ని బీజేపీ పొలిటికల్ గా వాడాలనుకోవడమే ఇక్కడ బాధాకరం.

ఎన్నికల అస్త్రంగా గ్యాంగ్ రేప్..

ఎప్పుడెప్పుడా అని కాచుక్కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనను బాగా హైలెట్ చేస్తున్నాయి. నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు దొరికిన ఈ అంశాన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. 

ఈ ఘటనపై బీజేపీ ఆల్రెడీ నేషనల్ మీడియాను దించేసింది.. తెలంగాణలో అరాచకం అనే కోణంలో గంటలు గంటలు వార్తలు, డిస్కషన్లు పెట్టిస్తోంది. అటు బీజేపీకి అనుకూలంగా తెలంగాణలో ఉన్న 2 తెలుగు ఛానెళ్లు కూడా దీన్ని హైలెట్ చేస్తున్నాయి.

రాజకీయ నాయకుల పిల్లలకు సంబంధం ఉందా..?

ఇలాంటి ఘటనలు జరగడమే దురదృష్టకరం అయితే, రాజకీయ నాయకుల పిల్లలకు ఇందులో ప్రమేయం ఉందని అనడం మరో సంచలనం. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ నేరుగా పేర్లు చెప్పి మరీ టీఆర్ఎస్, ఎంఐఎం నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. పబ్‌ లో పార్టీ బుక్‌ చేసింది హోంమంత్రి మనవడేనని ఆరోపించారు రఘునందన్. 

హోంమంత్రి పీఏ, బాధితురాలిని పబ్ లోపలకు పంపారని, హోంమంత్రి మనవడు, తెలంగాణ వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, పాతబస్తీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్‌ కొడుకు కూడా ఈ గ్యాంగ్ రేప్ లో నిందితులేనని ఆరోపిస్తున్నారాయన. వీరందర్నీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

విచిత్రం ఏంటంటే.. ఈ గ్యాంగ్ రేప్ జరిగింది మే 28. బాధితురాలి తండ్రి పోలీస్ కేసు పెట్టింది జూన్ 1న.  కానీ ఈ విషయం హైలెట్ అయింది మాత్రం జూన్ 3న. మధ్యలో ఏం జరిగింది..? ఎవరిని ఈ కేసు నుంచి తప్పించాలనుకుంటున్నారు. గ్యాంగ్ రేప్ కోసం వాడిన కారుని ఎందుకు సీజ్ చేయలేదు, సీసీ టీవీ ఫుటేజ్ ని మీడియాకు ఎందుకు చూపించలేదు. ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే.

మరోవైపు ఈ ఘటనలో నాయకుల పిల్లల ప్రమేయం లేదని, అనవసరంగా వారి భవిష్యత్తుని నాశనం చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. నేషనల్ మీడియాని కూడా రంగంలోకి దింపి చెడుగుడు ఆడేస్తోంది. ఎన్నికల కోసం దీన్ని ఓ ప్రధాన అస్త్రంగా మలుచుకునే పనిలో బిజీగా ఉంది. అటు కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లానే వెనకబడింది.