విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వైసీపీ సర్కార్ మొదటి నుంచి ఏది చెబుతుందో అదే చేస్తోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు అన్నట్లుగానే వైసీపీ ప్రభుత్వ వైఖరి పక్కా క్లారిటీగానే ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాట పట్టించేందుకు అనేక రకాల మార్గాలు ఉండగా కేవలం నష్టాల సాకు చూపించి ప్రైవేట్ చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అదే విషయమై వైసీపీ స్టీల్ ఉద్యమానికి అండగా ఉంటోంది.
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ఉద్యమ నేతలతో కలసి పోరాటాలు చేస్తున్నారు. ఇక జగన్ సైతం ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పరం కానివ్వమనే అంటున్నారు.
సొంత గనులతో పాటు ఉక్కు కర్మాగారం విషయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఇప్పటికే కేంద్రానికి మూడు లేఖలు ముఖ్యమంత్రి హోదాలో రాసిన జగన్ ఇపుడు ఏపీ హై కోర్టుకు కూడా తమ ప్రభుత్వ వాదన ఏంటి అన్నది అఫిడవిట్ రూపంలో సమర్పించారు.
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలన్నదే వైసీపీ సర్కార్ విధానమని తేటతెల్లంగా అఫిడవిట్ ద్వారా తేల్చేసింది. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.