టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని సీఎం చేసే బాధ్యత తాను తీసుకుంటానని జనసేనాని పవన్‌కల్యాణ్ పదేపదే పరోక్షంగా చెబుతున్నారు. ఇదే జనసేన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి. సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి, తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పకుండా, మరో పార్టీ నాయకుడి కోసం పరితపించడం ఏపీలోనే చూస్తున్నాం. జనసేన బలోపేతానికి పవన్‌కల్యాణే అవరోధం. ఇదే జనసేన విషాదం.
రాజకీయ పార్టీల స్థాపన ఉద్దేశం పదవీ కాంక్షే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులెవరైనా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుంటారు. అందుకు తగ్గట్టు రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు. ప్రత్యర్థుల కంటే తామే మెరుగైన లీడర్‌గా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ ఇలాంటి ధోరణికి పూర్తి భిన్నమైన నాయకుడు.
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా తాను చూస్తానని పవన్‌కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అదే విషయాన్ని పదేపదే ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే పొత్తులపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. మరి పవన్‌కల్యాణ్ ఓట్లు చీలకుండా ఎవరు బాధ్యత తీసుకోవాలనే చర్చ జనసేనలో జరుగుతోంది.
తమ నాయకుడు కాకుండా, మరో నాయకుడిని సీఎం చేయాలని అధినేత ఆలోచిస్తే, తామెందుకు వెంట నడుస్తామనే ప్రశ్న ఆ పార్టీ నేతల నుంచి ఎదురవుతోంది. కలిసి రావాలని పవన్ కోరే కంటే… ఆ పార్టీలో జనసేన కలిసిపోతే పోలా అని వ్యంగ్యంగా జనసేన నేతలే ప్రశ్నిస్తున్నారు. పవన్ ఉత్సాహం చూస్తుంటే… త్వరలో టీడీపీలో కలిసిపోయేలా ఉన్నారనే అనుమానాలు కూడా జనసేనలో ఉన్నాయి.
2019లో కూడా పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాలో తప్పిదాల వల్లే కనీసం తాను నిలిచిన రెండు చోట్ల గెలవలేకపోయారనే అభిప్రాయం పార్టీలో ఉంది. అప్పుడు కూడా జగన్‌ను అడ్డుకునేందుకు, అలాగే చంద్రబాబును మరోసారి సీఎం గద్దె ఎక్కించేందుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారనే సందేశం జనాల్లోకి వెళ్లడంతో అసలుకే ఎసరు వచ్చిందనే చర్చ జనసేనలో ఎప్పటి నుంచో సాగుతోంది.
ఇప్పుడు కూడా అదే కొనసాగడం…. పవన్‌కల్యాణ్ వైఖరిలో మార్పు రాలేదనేందుకు ఉదాహరణ. జనసేన శ్రేణులకు తప్ప తనకు ఉన్నత పదవిని అధిష్టించాలనే ఆకాంక్ష లేనప్పుడు, తామెందుకు, ఎవరి కోసం పనిచేయాలనే ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. పవన్‌కల్యాణ్ వైఖరేంటో స్పష్టంగా బయటపడితే …అందరి అనుమానాలు నిజమే అయితే, ఆయన వెంట నడిచే వాళ్లెవరూ ఉండరని మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ దిశానిర్దేశంపై ఉత్కంఠ నెలకుంది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, నాయకుల్లో. ఎందుకంటే చంద్రబాబు పల్లకీని తాను మోస్తూ, తమనూ మోయాలని ఆదేశిస్తారేమో అనే భయం జనసేనలో గూడు కట్టుకుంది.