ఇద్దరు రాజులకూ పైడితల్లమ్మ దీవెనలు

ఇప్పటికి రెండు వందల యాభై నాలుగేళ్ళుగా విజయనగరంలో శ్రీ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం నిరాటంకంగా సాగుతోంది. కరోనా వంటి ప్రకృటి ఉపద్రవం వచ్చినప్పటికీ అతి కొద్ది మంది భక్తులతో కూడా సిరిమాను ఉత్సవాన్ని పురవీధుల్లో నిర్వహించారు.…

ఇప్పటికి రెండు వందల యాభై నాలుగేళ్ళుగా విజయనగరంలో శ్రీ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం నిరాటంకంగా సాగుతోంది. కరోనా వంటి ప్రకృటి ఉపద్రవం వచ్చినప్పటికీ అతి కొద్ది మంది భక్తులతో కూడా సిరిమాను ఉత్సవాన్ని పురవీధుల్లో నిర్వహించారు. ఈసారి లక్షలాది జనం సాక్షిగా విజయనగరం వీధులలో సిరిమాను జాతర సాగింది.

ఈసారి ఉత్సవాన్ని ఇద్దరు రాజులు ఒద్దికగా కూర్చుకుని పూసపాటి రాజుగారి కోట నుంచి వీక్షించడం విశేషం. బొబ్బిలి రాజు, మాజీ మంత్రి అయిన సుజయ క్రిష్ణ రంగారావుతో పాటు అశోక్ గజపతిరాజు కలసి ఈ వేడుకలను ఉత్సాహంగా తిలకించి పులకించారు.

నిజానికి చరిత్రలోకి వెళ్తే బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు మ‌ధ్య అతి పెద్ద యుద్ధం నడచింది. 17వ శతాబ్దంతో  విజయనగరం రాజులు బొబ్బిలి రాజుల మధ్యన యుద్ధం జరిగింది. ఇది చరిత్ర. దానికి ముందు ఎంతో సన్నిహితంగా స్నేహంగా రెండు రాజ్యాలు ఉండేవి.

ఎపుడైతే పొరపొచ్చాలు వచ్చాయో నాటి నుంచే సమరానికి సై అన్నారు. చివరికి యుద్ధంలో అటూ ఇటూ కూడా చాలా మంది చనిపోయారు. తన అన్న విజయనగరం రాజు బొబ్బిలి యుద్ధంలో మరణిస్తాడని భావించి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఆయన చెల్లెలుకు బొబ్బిలి వెళ్లేలోగా అన్న మరణవార్త తెలిసి చెరువులోకి దూకేస్తుంది. ఆమె ప్రతిమ చెరువులో దొరకడంతో నాటి నుంచి ఆమెను పైడితల్లమ్మగా ఆరాధిస్తూ వందల ఏళ్ళుగా విజయనగరంలో సిరిమానోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఆ విధంగా విజయనగరం బొబ్బిలి రాజుల మధ్య యుద్ధ నివారణ కోసం ప్రయత్నించి చివరికి తనువు చాలించిన పైడితల్లి అమ్మవారుగా అవతరించిన  సందర్భం అది. ఇపుడు చూస్తే తెలుగుదేశం రాజకీయాల పుణ్యమాని విజయనగరం బొబ్బిలి రాజులు ఒక్కటి అయ్యారు. మరి ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పైడితల్లి అమ్మ దీవించే ఉంటుంది. ఈ అపురూప సన్నివేశాన్ని చూసి విజయనగరవాసులు కూడా తిలకించి ఇద్దరు రాజులు ఒక్కటి అయ్యారు అని ముచ్చటించుకోవడం విశేషం.