ఓ మోస్తరు సినిమాలకు కూడా పదేళ్లు, పదిహేనేళ్లు, ఇరవై యేళ్ల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. ఆ సినిమాలకు ఇలాంటి మైల్ స్టోన్స్ ను దాటాయనే విషయం జనాలకు పెద్దగా పట్టకపోయినా.. సదరు సినిమాల్లో నటించిన వారి అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా వాటిల్లో నటించిన తారలు మాత్రం పెద్దగా పట్టించుకోరు ఇలాంటి సందర్భాలను. తెలుగులో ఇలాంటి విడుదలలు దశాబ్దాలు గడిచిన తర్వాత సదరు తారలు సమావేశమై తమ అనుభూతులను పంచుకునే సినిమాలు అరుదుగానే ఉన్నాయి.
ఇలాంటి వాటిల్లో బాగా గుర్తింపుకు నోచుకున్న సినిమా 'శివ'. 1989లో ఈ సినిమా విడుదలైతే.. 2009లో ఈ సినిమాకు సంబంధించి ఇరవై యేళ్ల వేడుక గట్టిగా జరిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరోహీరోయిన్లు నాగార్జున, అమల ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్.. ఇలా ఇరవై యేళ్ల సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత అభిలాష సినిమాదో ఛాలెంజ్ సినిమాదో ఇలాంటి ఈవెంటే జరిగింది. కోదండరామిరెడ్డి, చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్ కేఎస్ రామారావు, యండమూరి వంటి వారు అప్పుడు తమ అనుభూతులను పంచుకున్నారు.
మరి ఆ సినిమాల స్థాయిది కాదు 'నువ్వే నువ్వే'. ఛాలెంజ్, అభిలాష లా.. సంచలనం కాదు, శివ లా అటూ ఇటూ అనుకోదగిన సినిమానూ కాదు. జనాలకు పెద్దగా పట్టకపోయినా.. ఈ సినిమా యూనిట్ 20 యేళ్ల ఉత్సవాన్ని జరుపుకుని ఉత్సాహంగా స్పందించింది. అది వాళ్ల ఆసక్తి. వాళ్ల అనుభూతి.
మరి ఇరవై యేళ్ల కిందట విడుదలైన నువ్వే నువ్వే సినిమాకు పట్ల ప్రేక్షకుల స్పందన కానీ, మీడియా స్పందన కానీ.. ఒకసారి గుర్తు చేసుకుంటే కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. నువ్వే నువ్వే సినిమాకు విడుదల సమయంలో బాగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి! అప్పట్లో 'ఆంధ్రభూమి' శుక్రవారం సమీక్షలు బాగా పాపులర్. జనాలు శుక్రవారం వచ్చే ఆంధ్రభూమి 'వెన్నెల' కోసం ఎదురుచూసేవాళ్లు. వాటిల్లో దాదాపు ప్రతి తెలుగు సినిమాకూ సమీక్ష వచ్చేది. నిర్భీతిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా, మొహం మీద కొట్టినట్టుగా రివ్యూలు 'వెన్నెల' ప్రత్యేకం. 'నువ్వే నువ్వే ' సినిమాకు కూడా అందులో రివ్యూ వచ్చింది. ఆ రివ్యూలకు హెడ్డింగులు కూడా చమత్కారంగా ఉండటం మరో ప్రత్యేకత.
ఈ తరహాలో 'నువ్వే నువ్వే' రివ్యూకు కూడా సెటైరిక్ టైటిట్ పెట్టారు.. 'నువ్వే వ్వెవ్వెవ్వే..' అని! 'వెవ్వెవ్వె..' అంటూ వెక్కిరంత తరహాలో ఈ సినిమాకు రివ్యూ హెడ్డింగ్ పెట్టి సింగిల్ స్టార్ వేశారు. నాలుగు స్టార్లకు గానూ ఒక స్టార్ అంటే బాగోలేదు అని వెన్నెల రిపోర్ట్. ఆంధ్రభూమి రివ్యూలు సదరు సినిమాలు థియేటర్లో ఆడటానికి తూకం లాంటివి. ఆ రివ్యూకు తగ్గట్టుగా నువ్వే నువ్వే థియేటర్లలో పెద్దగా హడావుడి చేయలేదు. ఎక్కడా యాభై రోజులను పూర్తి చేసుకున్న దాఖలాలు కూడా లేవప్పట్లో! అయితే ఈ సినిమాకు అప్పట్లో నంది అవార్డును ఇచ్చే అది వేరే కథ.
ఎందుకో ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు. వాస్తవానికి అప్పట్లో యూత్ ఫార్ములా సినిమాలు వరస హిట్లు. నువ్వే నువ్వే, జయం, దిల్, నువ్వే కావాలి.. ఈ సీజన్ కు కొనసాగింపే ఈ సినిమా కూడా! అయినా థియేటర్లో ఆడలేదు. అయితే ఈ సినిమా టీవీల్లో మాత్రం శతదినోత్సవాలను జరుపుకుని ఉంటుంది. నువ్వే నువ్వే సినిమా ను సన్ నెట్ వర్క్ వాళ్లు.. తమ చానళ్లలో ఇప్పటి వరకూ కొన్ని వందల సార్లు ప్రదర్శితం చేసి ఉండవచ్చు. ఇక ఈ సినిమా పాటలైతే..ఇప్పటికీ మార్మోగుతూ ఉంటాయి. కామెడీ సీన్లను బిట్స్ గా కట్ చేసి.. జెమినీ వాళ్లు అనునిత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా నువ్వే నువ్వే గత ఇరవై యేళ్లలోనూ నిత్యం ఏదో విధంగా ప్రదర్శితం అవుతూనే ఉంటుంది.
థియేటర్లలో ఆడలేకపోయినా.. ఇరవై యేళ్ల పాటు నిత్యం టీవీల్లో నిత్యనూతనంగా ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ సినిమా ప్రత్యేకమైనదే. ఇవే కాదు… నువ్వే నువ్వే సినిమా గురించి చెప్పుకోవాల్సిన విషయాలు మరిన్ని ఉన్నాయి! ఈ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎన్నో సినిమాల కాపీ కలబోత ఈ సినిమా!
కాపీ చేయడం విషయంలో త్రివిక్రమ్ సత్తా ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఈ దర్శకరచయిత మెగాఫోన్ పట్టిన తొలి సినిమా ఇది. దీంట్లో.. బోలెడన్ని కాపీలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కథకే ఒక హాలీవుడ్ సినిమా మూలాలున్నాయి. ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్ సీరిస్ కథల నుంచి అల్లుకున్న కథల్లో ఇదీ ఒకటి. అవే హాలీవుడ్ సినిమాల ఆధారంగా 'ఆకాశమంత' అనే మరో తమిళ-తెలుగు సినిమా వచ్చింది.
ఈ కథను కాపీ కొట్టడంలో కూడా అప్పటి దర్శకరచయిత మధ్య కాస్తపోటీ ఉండేదట. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఒక సారి చెప్పుకొచ్చాడు. ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్ ఆధారంగా తను సినిమా చేయాలనుకున్నట్టుగా.. చివరకు ఆ కథను త్రివిక్రమ్ కు వదిలేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు!
కేవలం కథే కాదు.. ఈ సినిమాలో కీలకమైన పాటలు కూడా కాపీ స్వరాలే కావడం గమనార్హం! ఈ సినిమాలో బాగా హిట్టైన పాటల్లో ఒకటి.. 'అందరినీ ఇలా అడగాలా.. సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా..' అనే పాట. తరుణ్, సునీల్ ల మీద అన్నవరంలో నైట్ పాడినట్టుగా ఉండే ఈ పాట.. ఒక పాత హిందీ పాటకు యథాతథమైన కాపీ! దేవానంద్ సినిమా అది. ఎలా ఉందంటే.. యాజిటీజ్ గా ఉందన్నట్టుగా.. హిందీ ట్యూన్ మక్కికిమక్కి దించేశారు. అలాగే 'అయామ్ వెరీ సారీ..' అనే పాట మరో ఇంగ్లిష్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి కొట్టేసింది. ఈ పాట చిత్రీకరణలో కూడా.. త్రివిక్రమ్ హాలీవుడ్ ధోరణినే కాపీ కొట్టాడు. ఇంగ్లిష్ పాట చిత్రీకరణలో హీరో ఎలా దిగుతాడో.. తరుణ్ ను అలానే దింపేశాడు ఈ దర్శకుడు!
ఇక ఈ సినిమాను బాగా పాపులర్ చేసిన విషయాల్లో.. ఒకటి సునీల్- ఎమ్మెస్ నారాయణ కామెడీ. ఇది కూడా ఒక బాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టిందే. జానీ లీవర్ కామెడీ సీన్ ను జస్ట్ తెలుగులోకి అనువదించి సునీల్ తో చేయించాడు దర్శకరచయిత త్రివిక్రమ్. హిందీ సీన్ కు తెలుగు డైలాగులు చెబితే ఎలా ఉంటుందో.. అంతలా కాపీ ఈ సీన్!
ఇలా 'నువ్వే నువ్వే' ను పట్టి చూస్తే.. బోలెడన్ని కాపీలు, పేరడీలు ఉంటాయి. అవే ఈ సినిమాను టీవీలో సూపర్ హిట్ గా చేశాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన తరుణ్ కు గత పదేళ్లుగా చెప్పుకోదగిన సినిమాలు లేవు. దాదాపు పుష్కరకాలం నుంచి అతడిని పట్టించుకోవడం లేదు టాలీవుడ్. సునీల్ కామెడీతో స్టార్ అయ్యి, ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. శ్రియ ఈ సినిమాలో ఆకట్టుకుంది. స్టార్ అయ్యింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుని తల్లి వేషాల్లో ఉందిప్పుడు. నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నారు. సంగీత దర్శకుడు కోటి కి కూడా సినిమాల్లేవు. ఈ యూనిట్ మొత్తానికీ ఇప్పుడు వెలుగుతున్నది త్రివిక్రమ్ మాత్రమే. దర్శకుడిగా తన తొలి సినిమా ఇరవై యేళ్లు పూర్తి అయినందుకు.. నువ్వే నువ్వే 20 యేళ్ల సందర్భాన్ని నిజంగా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిల్లో ఉన్నది ఆయన ఒక్కరు మాత్రమే!