ఇరాన్ లో యాంటీ హిజాబ్ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ముస్లిం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ను ధరించాల్సిందే అనే సామాజిక ఒత్తిడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు ఈ యాంటీ హిజాబ్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారిపై మోరల్ పోలీసింగ్ సాగుతూ ఉంది. ఇది తీవ్ర హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారంలో దాదాపు వంద మంది వరకూ మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
నిరసన తెలుపుతున్న మహిళలపై హత్యాకాండ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇరానియన్ నటి ఇన్ స్టాగ్రమ్ లో ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ వలువలు విప్పింది. ఇల్ నాజ్ నౌరోజీ అనే నటి ఇన్ స్టాలో ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ వీడియో పెట్టింది. ఇందులో ఆమె ముందుగా హిజాబ్ ను ధరించి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని విప్పి.. తన బట్టలన్నీ విప్పుకుంటుంది. ఆమె దాదాపు నగ్నంగా మారి.. యాంటీ హిజాబ్ నినాదాన్ని పోస్టు చేసింది.
వస్త్రధారణ పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అని, ఇందులో తప్పనిసరి అంటూ ఒత్తిడి చేయడానికి వీల్లేదని సదరు నటి ఈ వీడియోతో నినదించింది. మరి ఇరానియన్ మహిళలు తెలుపుతున్న ఈ నిరసన ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాల్సి ఉంది.
ఇక ఇదే సమయంలో కర్ణాటకలో హిజాబ్ అంశం పై జరిగిన రచ్చ ఈ సందర్భంగా చర్చనీయాంశం అవుతుంది. కర్ణాటకలో విద్యాలయాల్లోకి హిజాబ్ తో ప్రవేశాన్ని నిషేధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల్లో మతపరమైన కట్టుబాట్లకు తావులేదని ప్రభుత్వం వాదించింది. ఈ అంశం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. తమ వస్త్రధారణ తమ ఇష్టం అని అక్కడ ముస్లిం యువతులు నిరసనలకు దిగారు.
హిజాబ్ ను తాము స్వచ్ఛందంగా ధరిస్తున్నప్పుడు ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకంటూ నిరసన తెలిపారు. ఆ అంశంపై కోర్టు ఇంకా ఎటూ తేల్చలేదు. మొత్తానికి హిజాబ్ కావాలని ఒక చోట, వద్దని మరో చోట కొన్ని నెలల వ్యవధిలో నిరసనలు వార్తలకు ఎక్కాయి. అయితే ఎక్కడైనా ఒక నినాదం మాత్రం స్పష్టం.. అది వస్త్రధారణ తమ ఇష్టం! అనేది!