స్పైడర్ మ్యాన్ అనిపించుకుంటున్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్! పేరుకు ఉప ముఖ్యమంత్రే కానీ.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారనే పేరును పొందుతూ, అంతా తానై వ్యవహరిస్తూ.. స్పైడర్ మ్యాన్ తరహాలో ఈయన పని చేస్తున్నారంటూ ప్రత్యర్థులు కూడా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.
గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఫడ్నవీస్.. శివసేన తిరుగుబాటు కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన స్థాయిని తగ్గించేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయి నుంచి ఉపముఖ్యమంత్రి హోదాకు తగ్గారు. పేరుకైతే ఈయన ఉపముఖ్యమంత్రి కానీ.. చెల్లుబాటు అంతా ఫడ్నవీస్ దే అనే టాక్ మొదటి నుంచి ఉంది.
ఈ కూటమి ప్రభుత్వం స్వల్ప స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేయడం గురించి ఫడ్నవీస్ ఢిల్లీ చుట్టూ తిరిగారు. కేబినెట్ ఏర్పాటు గురించి ఉప ముఖ్యమంత్రి ఇలా తిరగడం ఎవ్వరూ చూసి ఉండరు! ఇక ఈ కేబినెట్ ను మరింతగా విస్తరించాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా కూడా… ఫడ్నవీస్ దే కీలక పాత్ర అని తెలుస్తోంది. కేబినెట్లోకి కొత్తగా ఎవరిని చేర్చుకోవాలనే అంశంపై ఉపముఖ్యమంత్రి దృష్టి సారించినట్టుగా ఉన్నారు.
అది మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి షిండే.. ఈ ఉపముఖ్యమంత్రికి మరో బాధ్యతను ప్రకటించారు! ఏకంగా ఆరు జిల్లాల బాధ్యుడిగా ఉపముఖ్యమంత్రిని ప్రకటించారు. ఇలా ఫడ్నవీస్ ను ఏకంగా ఆరు జిల్లాలకు ఇన్ చార్జి మంత్రిగా ప్రకటించడం విశేషం. మరి ఒకే మంత్రి ఆరు జిల్లాల ఇన్ చార్జి గా వ్యవహరిస్తున్నారా.. ఆయన స్పైడర్ మ్యాన్ ఏమో అంటూ ప్రత్యర్థులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే ఫడ్నవీస్ మాత్రం ఈ హోదాలన్నింటితోనూ ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. మరి మహారాష్ట్రలోని అన్ని జిల్లాలకూ ఫడ్నవీస్ నే ఇన్ చార్జిగా ప్రకటించేసి ఉంటే.. ఆయన త్యాగానికి మరింత న్యాయం జరిగేదేమో!