తెలంగాణ‌పై సుప్రీం క‌న్నెర్ర‌!

తెలంగాణ స‌ర్కార్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం క‌న్నెర్ర చేసింది. త‌మ ఆదేశాల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే ధిక్క‌రించారంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను ధిక్క‌రించిన అధికారుల‌కు జైలు శిక్షే ప‌రిష్కార‌మ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం…

తెలంగాణ స‌ర్కార్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం క‌న్నెర్ర చేసింది. త‌మ ఆదేశాల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే ధిక్క‌రించారంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను ధిక్క‌రించిన అధికారుల‌కు జైలు శిక్షే ప‌రిష్కార‌మ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత విద్యుత్ రంగానికి సంబంధించిన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌లేదు. దీంతో స‌ర్వోన్న‌త న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వెళ్లిన 84 మంది విద్యుత్ ఉద్యోగుల‌కు నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి తెలంగాణ స‌ర్కార్ అంగీక‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు విద్యుత్ ఉద్యోగుల‌కు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. వెంట‌నే వారికి నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని తెలంగాణ స‌ర్కార్‌ను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల‌ను తెలంగాణ స‌ర్కార్ ఖాత‌రు చేయ‌లేదు. దీంతో మ‌రోసారి విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో జ‌స్టిస్ ఎం.ఆర్. షా, కృష్ణ మురారిల ధర్మాసనం తీవ్ర‌స్థాయిలో స్పందించింది. విద్యుత్ ఉద్యోగులకు నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వాల‌నే త‌మ ఆదేశాల‌ను దురుద్దేశ‌పూర్వ‌కంగానే ఉల్లంఘించార‌ని ధ‌ర్మాస‌నం మండిప‌డింది. కోర్టు ధిక్కారం కింద విద్యుత్ శాఖ అధికారుల‌కు జైలు శిక్షే ప‌రిష్కార‌మ‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

జస్టిస్ ధర్మాధికారి ఏక సభ్య కమిటీ నివేదిక పైనల్ అని పలుసార్లు సుప్రీం స్పష్టం చేసినా తెలంగాణ కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. త‌మ ఆదేశాల అమలుకు తెలంగాణకు చివరి అవకాశాన్ని ధ‌ర్మాస‌నం  ఇచ్చింది. రెండు వారాల్లో అమలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇప్ప‌టికైనా తెలంగాణ స‌ర్కార్ దిగి వ‌స్తుందా? లేదా? అనేది చూడాలి.