ప్రతి మీడియా వెనుక ఈనాడు

ఎవడైనా కసితో కొడతాడు..కోపంతొ కొడతాడు అనే డైలాగు ఒకటి రాసారు త్రివిక్రమ్. కొట్టడం వరకు ఇది ఓకె కానీ ఎవరైనా ఏదైనా సంస్థలను లాభం కోసం పెడతారు. లేదా పోటీగా పెడతారు. అంతే తప్ప…

ఎవడైనా కసితో కొడతాడు..కోపంతొ కొడతాడు అనే డైలాగు ఒకటి రాసారు త్రివిక్రమ్. కొట్టడం వరకు ఇది ఓకె కానీ ఎవరైనా ఏదైనా సంస్థలను లాభం కోసం పెడతారు. లేదా పోటీగా పెడతారు. అంతే తప్ప కోపంతో స్టార్ట్ చేయరు. అయితే తెలుగునాట మీడియా వ్యవహారం మాత్రం ఇలా లేదు. పుట్టుకు వస్తున్న ప్రతి మీడియా సంస్థ వెనుక ఈనాడు మీద కోపమే వుంటోంది.

దర్శకుడు దాసరికి ఈనాడు మీద కోపం వచ్చింది. ఈనాడు తొలి సంపాదకుడు ఎబికె ప్రసాద్ దానికి ఆజ్యం పోసారు. ఫలితంగా ఉదయం దినపత్రిక పుట్టుకు వచ్చింది. తెలుగు వారికి ఓ మాంచి దినపత్రిక చదివే అవకాశమూ ఇచ్చింది. కానీ పాపం ఉదయం ఆదాయ మూలాలు దెబ్బ తీయడం కోసమే మద్యపాన నిషేధం ఉద్యమం పుట్టుకువచ్చింది అనే వారూ వున్నారు. సరే అదంతా వేరే సంగతి.

వ్యాపారస్థులు సంఘీ బ్రదర్స్ కు రామోజీ మీద కోపం వచ్చింది లేదా రామోజీకి ఇచ్చే ప్రయారీటీ చూసి తమకూ కావాలనిపించింది. మళ్లీ ఎబికే ప్రసాద్ అక్కడ ప్రత్యక్షం అయ్యారు. వార్త దినపత్రిక పుట్టుకువచ్చింది. ఉత్తరోత్తరా అది అలా అలా హిట్..ఫ్లాపు మధ్య కొట్టుమిట్టాడుతూ సాగుతోంది.

వైఎస్ కు రామోజీ మీద ఆగ్రహం కలిగింది. దాంతో మళ్లీ ఎబికె సాయం పట్టారు. సాక్షి పత్రిక..ఛానెల్ పుట్టుకు వచ్చాయి. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి..ఈనాడును కాస్త షేక్ చేసాయి. ఈనాడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. జీతాల బిల్లూ పెరిగింది సాక్షి మూలంగానే అని వార్తలు వచ్చాయి.

ఈనాడు మీద నేరుగా కోపం లేకపోయినా తమకు కూడా ఓ పత్రిక వుండాలని అనుకోవడం వల్లనే ‘నమస్తే తెలంగాణ’ ‘వెలుగు’ లాంటి పత్రికలు పుట్టుకువచ్చాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈనాడు మీద కోపంతో ఛానెల్ తెస్తాం అంటున్నారు వైకాపా ఎంపీ విజ‌యసాయి రెడ్డి. అవసరం అయితే పేపర్ కూడా పెడతాం అంటున్నారు. కానీ ఒకటే అనుమానం ఆయనకు పార్టీకి అండగా వుండే సాక్షి వుండనే వుంది కదా? సరిపోవడం లేదా? ఎంతయినా అది జ‌గన్ స్వంతం..మనకూ ఒకటి వుండాలనుకుంటున్నారా?

ఏమైనా ఈనాడు ముగురమ్మల మూల పుటమ్మ మాదిరిగా తెలుగు పత్రికా ప్రపంచం విస్తరించడానికి ఏదో విధంగా దోహదం చేస్తోంది. అది మంచిగానో..చెడ్డగానో..అది వేరే సంగతి.