రామోజీని బ‌జారుకీడ్చిన విజ‌య‌సాయి!

ఆచ‌రించే వాళ్లు నీతులు చెబితే విలువ వుంటుంది. ఈనాడు అధిప‌తి రామోజీరావు నీతులు చెబితే…దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా వుంటుంద‌ని చిన్న పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. మార్గ‌ద‌ర్శిని అడ్డు పెట్టుకుని ఆయ‌న ఆర్థిక నేరానికి పాల్ప‌డ్డార‌నే…

ఆచ‌రించే వాళ్లు నీతులు చెబితే విలువ వుంటుంది. ఈనాడు అధిప‌తి రామోజీరావు నీతులు చెబితే…దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా వుంటుంద‌ని చిన్న పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. మార్గ‌ద‌ర్శిని అడ్డు పెట్టుకుని ఆయ‌న ఆర్థిక నేరానికి పాల్ప‌డ్డార‌నే విష‌య‌మై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కేసు నుంచి ఆయ‌న ఎలా త‌ప్పించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఇదిలా వుండ‌గా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిని గిల్లి రామోజీరావు త‌న గురించి తానే బ‌య‌ట పెట్టుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నారు. విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేయ‌బోయి, చివ‌రికి తానే టార్గెట్ అయ్యారు. తానొక‌టి అంటే, ప‌ది మాట‌లు ప్ర‌త్య‌ర్థులు అంటార‌నే క‌నీస స్పృహ లేకుండా విజ‌య‌సాయిరెడ్డిపై “ఈనాడు” క‌థ‌నం రాసి, అభాసుపాలైంది. రెండు రోజుల క్రితం ఈనాడులో “సాయిరెడ్డి గారూ…ఈ భూములెవ‌రివి?” అంటూ బ్యాన‌ర్ క‌థ‌నం రాసింది.

విజ‌య‌సాయిరెడ్డి అన్న ఒక మాట‌ను ప‌ట్టుకుని, ఆయ‌న్ను వెట‌కారం చేస్తూ క‌థ‌నాన్ని అల్లింది. “నేనుండే మూడు ప‌డ‌క గదుల ప్లాట్ త‌ప్ప విశాఖ ప‌ట్నంలో నాకు ప్ర‌త్య‌క్షంగా గానీ, ప‌రోక్షంగా గానీ ఎటువంటి ఆస్తులు లేవు. నాకు సంబంధించిన‌వి ఇత‌రులెవ‌రి పేరుతోనూ లేవు. నా పేరుతో గానీ, నా కుటుంబ స‌భ్యుల పేరుతోగానీ లేవు. ఆస్తులు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు” అని విజ‌య‌సాయిరెడ్డి అన్న మాట‌ల‌ను తీసుకుని ఈనాడు క‌థ‌నం రాసింది.  

“ఏం చెప్పారు సాయిరెడ్డి గారూ! విశాఖ‌లో మీకు ఆస్తులే లేవా? మీ కుటుంబ స‌భ్యులెవ‌రి పేరుతోనూ లేవా? మ‌రి పెన‌క నేహారెడ్డి, పెన‌క రోహిత్‌రెడ్డీ ఎవ‌రు? మీ కుమార్తె, అల్లుడు కాదా? కుమార్తెను, అల్లుణ్నీ కుటుంబ స‌భ్యులుగా ప‌ర‌గ‌ణించ‌కూడ‌ద‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య చ‌ట్టమేదైనా తెచ్చిందా?” అంటూ త‌న మార్క్  వెట‌కారాన్ని కథ‌నంలో ఈనాడు ద‌ట్టించింది. అస‌లే విజ‌య‌సాయిరెడ్డి. త‌న జోలికి వ‌స్తే అంత మంచివాడిని కాదంటూ ఇటీవ‌ల హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈనాడు క‌థ‌నంపై త‌నదైన విమ‌ర్శ‌తో చిత‌క్కొట్టారు.

ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నార‌ని రామోజీరావు ఆక్ర‌మ‌ణ‌ల బాగోతాన్ని లోకానికి చాటి చెప్పారు. పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? అని ప్ర‌శ్నించి రామోజీ నిజ స్వ‌రూపాన్ని క‌ళ్ల‌కు క‌ట్టారు.  మార్గదర్శి డిపాజిటర్లను మోసం చేసిన వ్యక్తి రామోజీ అంటూ ఆయ‌న గురివింద నీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.  ఆస్తులపై విచారణకు చంద్రబాబు, రామోజీ సిద్ధమా?’ అంటూ సవాల్ విసిరి ప్ర‌త్య‌ర్థుల నోళ్లు మూయించారు.

విజ‌య‌సాయిరెడ్డి ఇవాళ నిర్వ‌హించిన ప్రెస్‌మీట్ రామోజీకి ఎంత‌గా వేడి పుట్టించిందంటే… త‌న ప‌త్రిక వెబ్‌సైట్‌లో ప్ర‌చురించ డానికి ఇష్ట‌ప‌డ‌నంత‌గా. ఎక్క‌డైనా ఒక నాయ‌కుడిపై క‌థ‌నం వండి వార్చితే, వివ‌ర‌ణ ఇవ్వ‌డం క‌నీస జ‌ర్న‌లిజం నైతిక విలువ‌. అలాంటిది విజ‌య‌సాయిరెడ్డిపై తాటికాయంత శీర్షిక‌తో బ్యాన‌ర్ క‌థ‌నం అచ్చోసి, ఆయ‌న కౌంట‌ర్ ఇస్తే, క్యారీ చేయ‌క‌పోవ‌డం రామోజీరావు మార్క్ నీతికి నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

ఫిల్మ్ సిటీ పేరుతో 2,500 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన పెద్ద మ‌నిషి, మ‌రొక‌రి ఆస్తుల గురించి రాయ‌డ‌మే అనైతికం. తాను ఆచ‌రించ‌ని నైతిక సూత్రాల‌ను ఇత‌రులు పాటించాల‌నే ఫిలాస‌ఫీ రామోజీ సొంత‌మ‌నే వ్యంగ్యంగా చెబుతుంటారు. కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింద‌ని విజ‌య‌సాయిరెడ్డితో అనిపించుకునే దుస్థితికి రామోజీ దిగ‌జారారు. రామోజీకి నైతిక విలువలు లేవ‌ని, ఆయ‌న‌ పుట్టుకే అనైతికం అనే తీవ్ర విమ‌ర్శ విజ‌య‌సాయిరెడ్డి చేసే ప‌రిస్థితి ఎందుకు? ఎవ‌రి కోసం తెచ్చుకున్నారో రామోజీ ఆలోచించాలి.