దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబునాయుడు సూపర్బ్ కామెంట్ చేశారు. ఇందుకు ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ సిరీస్-2 వేదికైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదలైంది. అన్‌స్టాపబుల్ సిరీస్ ప్రారంభ ఇంటర్వ్యూ నారా చంద్రబాబునాయుడితో మొదలు కానుంది. ప్రతి శుక్రవారం ప్రత్యేక అతిథితో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో తన బావ చంద్రబాబు గురించి బాలయ్య చెప్పిన తీరు ఆకట్టుకుంది. “ప్రజలందరి బంధువు, మీకు బాబు గారు, నాకు బావగారు” అంటూ చంద్రబాబు గురించి బాలయ్య చెప్పుకొచ్చారు. తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని, ఒకటి వసుంధరతో, రెండోది ఏడాది క్రితం నుంచి అన్‌స్టాపబుల్‌తో అన్నట్టు బాలయ్య తన బావతో చెప్పారు. అయితే ఈ బ్రేకింగ్ వార్తను వసు(బాలయ్య భార్య వసుంధర)తో చెబుతామని చంద్రబాబు ఫోన్ చేసినట్టు అభినయిస్తారు.
ఇంటర్వ్యూలో భాగంగా బాబుకు రొమాంటిక్ ప్రశ్నలేస్తారు. మీ లైఫ్‌లో మీరు చేసిన రొమాంటిక్ పని ఏంటని బాలయ్య అడిగితే… మీకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు కవ్వించారు. మీరు సినిమాల్లో చేస్తున్నారు, నేను స్టూడెంట్‌గా చేశానని చంద్రబాబు యవ్వనపు రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని బాలయ్య ప్రశ్నిస్తారు.
రాజశేఖరరెడ్డి, మేమిద్దరం కలిసి బాగా తిరిగామంటూ చంద్రబాబు హుషారుగా చెబుతారు. ఎందుకో తెలియదు కానీ, ఆ సమయంలో బాలయ్య కన్నీటి పర్యంతమవుతారు. మీరిద్దరూ కలిసి చేసిన ఒక అల్లరి పని ఏంటో చెప్పాలని బాలయ్య ఆట పట్టిస్తారు. అల్లరి పని కంటే కూడా …అనే చంద్రబాబు ఏదో చెబుతారు. ఆ మాటలేంటో తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ కోసం వేచి చూడాల్సిందే. కానీ తన స్నేహితుడు వైఎస్సార్ అని, ఇద్దరం కలిసి బాగా తిరిగినట్టు రెండు మంచిమాటలు చెప్పినట్టు ప్రోమోలో చెప్పిన సంగతుల్ని చూస్తే అర్థమవుతుంది.
చంద్రబాబుకు రాజకీయంగా వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌తో చంద్రబాబు రాజకీయంగా పోరాడుతున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం కంటే, వ్యక్తిగత వైషమ్యాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌పై చంద్రబాబు మంచిగా మాట్లాడ్డం వైసీపీ శ్రేణులకి షాక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇదిలా వుండగా ఇంటర్వ్యూలో బావ, బామ్మర్దుల మధ్య సరదా సంభాషణ సాగింది.