వైసీపీ ఎమ్మెల్యేతో అదే పార్టీ స‌ర్పంచ్ ఢీ..ఓటుకు రూ.5 వేలు!

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డితో అదే పార్టీకి చెందిన కొత్త‌ప‌ల్లె స‌ర్పంచ్ శివ‌చంద్రారెడ్డి ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయ‌తీ కొత్త‌ప‌ల్లె. ఇక్క‌డి నుంచి…

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డితో అదే పార్టీకి చెందిన కొత్త‌ప‌ల్లె స‌ర్పంచ్ శివ‌చంద్రారెడ్డి ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయ‌తీ కొత్త‌ప‌ల్లె. ఇక్క‌డి నుంచి శివ‌చంద్రారెడ్డి స‌ర్పంచ్‌గా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని 13వ వార్డు ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్మాత్మ‌కంగా జ‌రుగుతోంది. ఎమ్మెల్యే, స‌ర్పంచ్ మ‌ధ్య కొంత కాలంగా విభేదాలున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యే త‌న అభ్య‌ర్థిగా బ్ర‌హ్మానంద‌రెడ్డిని నిలిపారు. మ‌రోవైపు స‌ర్పంచ్ త‌న కుమారుడైన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిని బ‌రిలో నిలిపారు. ఈ సంద‌ర్భంగా వైసీపీలోని రెండు వ‌ర్గాలు మీడియాకెక్కి మాట‌ల తూటాలు పేల్చుకున్నాయి. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం సై అంటే సై అని వైసీపీలోని ఇరువ‌ర్గాలు త‌ల‌ప‌డ్డాయి. మొత్తం 1,171 ఓట్లున్న వార్డుకు ఇవాళ ఎన్నిక జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల్లో ఓట‌ర్లను ప్ర‌లోభ పెట్ట‌డంలో ఇరువ‌ర్గాలు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఓటుకు క‌నీసం రూ.5 వేలు, గ‌రిష్టంగా కొంద‌రికి రూ.10 వేలు కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే మ‌హిళ‌ల‌కు బంగారు, వెండి గొలుసులు కూడా పంచిన‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. ఇరువ‌ర్గాల నేత‌లు ఒక వార్డు ఉప ఎన్నిక కోసం కోట్లాది రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ఓట‌ర్ల‌కు భారీగా తాయిలాలు పంపిణీని బ‌ట్టి వార్డు ఉప ఎన్నిక‌ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, కొత్తప‌ల్లె స‌ర్పంచ్ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

కొత్త‌ప‌ల్లె సర్పంచ్ మొద‌టి నుంచి వైఎస్సార్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా మెలుగుతున్నారు. వైఎస్సార్ మొద‌లుకుని, ఆయ‌న కుమారుడైన సీఎం జ‌గ‌న్ వ‌ర‌కూ స‌ర్పంచ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఈ ఎన్నిక‌లో గెలుపు ఎమ్మెల్యే ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు సంబంధించిందిగా మారింది. కొత్త‌ప‌ల్లె స‌ర్పంచ్‌కు ప్ర‌తిప‌క్షాలు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని అధికార పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. సాయంత్రానికి ఫ‌లితం రానుంది. ఈ ఎన్నిక ఫ‌లితం కోసం ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది.