వినేవాళ్లుంటే చంద్రబాబునాయుడు ఎన్నైనా, ఏమైనా చెబుతారు. నాలుగు దశాబ్దాలుగా మాటల మీదే ఆయన రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని చెప్పుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. బాబు ఏం చెప్పినా ప్రచారం చేసే మీడియా ఉండనే వుంది. ఎద్దు ఈనిందని చంద్రబాబు చెబితే, తమ ఆరాధ్య నాయకుడు చెప్పాడు కాబట్టి, నిజమే అయి వుంటుందని ప్రచారం చేసే మీడియా సంస్థలు తెలుగునాట ఉన్నాయి.
అయితే సోషల్ మీడియా రాకతో చంద్రబాబు ప్రాభవం పూర్తిగా మసకబారింది. బాబు చెప్పిందానికి వెంటనే బలమైన కౌంటర్ వస్తోంది. విజన్-2047 అంటూ చంద్రబాబు తన మార్క్ ఆర్భాటంతో కొత్త ప్రచారానికి తెరలేపారు. విజన్-2020 అని నాడు పెద్ద ఎత్తున చంద్రబాబు ఊదరగొట్టారు. అది ఏమైందో తెలియదు. తనకు మరోసారి అధికారం ఇస్తే…. ఆకాశంలో ఉన్న చందమామను అరచేతిలో పెడతానని నమ్మబలుకుతున్నారు.
సుదీర్ఘ కాలం పాటు పాలించిన చంద్రబాబు అన్నీ సక్రమంగా చేసి వుంటే, ఇంకా విజన్ పేరుతో నాటకాలెందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడాయన ఏపీ గురించి మాత్రమే మాట్లాడ్డం లేదు. ఏకంగా మన దేశాన్నే బాగు చేస్తానని అంటున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు మాటలను ఎంత వరకు నమ్మొచ్చో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించి ఏపీని భ్రష్టు పట్టించిన చంద్రబాబు, ఇప్పుడు జగన్ పాలనకు 14 మార్కులు వేయడం ఆయనకే చెల్లింది. గత ఐదేళ్లలో తాను అద్భుతంగా పాలించి వుంటే, కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లకే ఏపీ ప్రజానీకం ఎందుకు పరిమితం చేసిందో ఆయన సమాధానం చెప్పాలి. పాలకుడిగా తనకు జనం వేసిన మార్కులెన్నో తెలిసి కూడా చంద్రబాబు భారీ డైలాగ్‌లు కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కనీసం తన కొడుకుని కూడా గెలిపించుకోలేనంత అధ్వానంగా పాలన ఉందని, అందుకే ఓడించి మూలన కూచోపెట్టారని చంద్రబాబు తెలుసుకోవాలి. పాలకుడిగా జగన్‌కు పాస్ మార్కుల సంగతి తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా తనకెన్ని మార్కులో ఆయన తెలుసుకోవాలి.