తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ, ఒరిజినల్ కాంగ్రెస్ అనే రెండు గ్రూప్‌లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఇక మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో షర్మిల చర్చలు విజయవంతంగా పూర్తయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో పని చేసేలా షర్మిల అంగీకరించారు. ఏపీలో ఆమె అడుగు పెట్టే అవకాశాలు చాలా తక్కువే.
షర్మిల చేరికతో తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవ మరింత పెరిగే అవకాశం వుంది. వైఎస్సార్ గ్రూప్ బలోపేతం కానుంది. తెలంగాణలో వైఎస్సార్ మనుషులుగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకులకు కొరత లేదు. కొండా దంపతులు కూడా వైఎస్సార్ శిష్యులుగా అధికారాన్ని చెలాయించారు. అయితే మారిన పరిస్థితిలో కొండా దంపతులు గ్రూపులకు కాస్త దూరంగా వున్నట్టే కనిపిస్తోంది.
ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. సమావేశాల్లో అందరూ కలిసి పాల్గొంటున్నట్టు కనిపిస్తున్నా, వాళ్ల మధ్య అంతర్గత గొడవలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు రేవంత్‌రెడ్డే సోషల్ మీడియాలో చేరుతున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాన ఆరోపణ. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఆవేదన గురించి చెప్పాల్సిన పనిలేదు. రేవంత్‌రెడ్డి నాయకత్వం కింద పని చేయలేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా ఎమ్మెల్యే , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో షర్మిల చేరికను రేవంత్‌రెడ్డి వర్గం వ్యతిరేకించడాన్ని అర్థం చేసుకోవచ్చు. రేవంత్‌రెడ్డి, సీతక్క తదితరులు చంద్రబాబు వర్గంగా గుర్తింపు పొందారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లేదని, దాన్ని వైఎస్ జగన్ ఆంధ్రాకు తీసుకెళ్లారని కామెంట్ చేశారు. కేటీఆర్ అన్నప్పటికీ ఇప్పుడు షర్మిల రాకతో మరోసారి వైఎస్సార్ వర్గం తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్‌లో మిగిలిన నాయకులంతా ఏకం కావడం ఖాయం. భట్టి విక్రమార్క, ఉత్తమ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర నేతలంతా ఏకతాటిపైకి రానున్నారు. షర్మిల రాక టీడీపీ అనుకూల కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోగా, ఇతర నాయకుల్లో మాత్రం ఆనందం కనిపిస్తోంది. తెలంగాణలో షర్మిల రాకను అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులు ఏ విధంగా రాజకీయాలు చేస్తారో చూడాలి.