ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి తన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో తనకు నమ్మకస్తులైన వారికి పదవులు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వెంకయ్యనాయుడి శిష్యుడికి పురందేశ్వరి గట్టి షాక్ ఇచ్చారు. అయితే ఆ నాయకుడిని పక్కన పెట్టడంపై సొంత పార్టీలో ఆనందం వెల్లువిరుస్తోంది.
ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, తిరుపతి బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డికి పురందేశ్వరి చెక్ పెట్టారు. తిరుమల కొండను అడ్డు పెట్టుకుని, కేవలం దర్శనాలతోనే కేంద్ర పెద్దల గుడ్ లుక్స్‌లో భానుప్రకాశ్‌రెడ్డి పడ్డారు. దీంతో ప్రజలతో సంబంధం లేకుండా ఆయన రాజకీయంగా లబ్ధి పొందడంపై సొంత పార్టీ నేతలెవరికీ నచ్చడం లేదు. వెంకయ్యనాయుడి శిష్యుడిగా ఆయన చెలామణి అవుతున్నారు.
గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా భానుప్రకాశ్‌రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని వెంకయ్యనాయుడు ఇప్పించారనే ప్రచారం వుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్‌తో వైసీపీ మంచి సంబంధాలు కలిగి ఉండడాన్ని భానుప్రకాశ్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణ బలంగా వుంది. తిరుపతిలో ప్రజాసమస్యలపై భానుప్రకాశ్‌రెడ్డి ఏనాడూ ఉద్యమించిన దాఖలాలు లేవని ఆ పార్టీ నేతలే విమర్శిస్తుంటారు.
భానుప్రకాశ్‌రెడ్డి ఎక్కడుంటారంటే… తిరుపతి విమానాశ్రయం లేదా తిరుమల ఆలయం ముందు అని బీజేపీ నేతలు వెటకరిస్తుంటారు. లేదా సాయంత్రం పూట ఎల్లో మీడియా చానళ్లలో అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పురందేశ్వరి తాజా టీమ్‌లో భానుప్రకాశ్‌రెడ్డికి చోటు లభించకపోవడం కొందర్ని ఆశ్చర్యపరుస్తోంది. తిరుపతిలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది. పురందేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా చేసిన ఒకే ఒక మంచి పనిగా ఆ పార్టీ నేతలు అంటున్నారు.