Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గద్దర్​ కొడుకు పోటీ ...?

ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గద్దర్​ కొడుకు పోటీ ...?

తెలంగాణలో ఇప్పుడొక వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్​ కొడుకు సూర్యం పోటీ చేస్తాడని. గద్దర్​ చనిపోయినప్పటినుంచి తెలంగాణ మొత్తం ఆయన ​నామస్మరణతో ఊగిపోతోంది. అధికార బీఆర్​ఎస్​తో సహా అన్ని పార్టీలవారు గద్దర్​కు ఘనంగా నివాళులర్పించారు. ఘనంగా సంతాప సభలు, సంస్మరణ సభలు నిర్వహించారు.

గద్దర్​ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం తెలిసిందే. సీఎం కేసీఆర్​ స్వయంగా వెళ్లి గద్దర్​కు నివాళులర్పించారు. దాదాపు అందరు మంత్రులు గద్దర్​ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్​ కవిత కూడా ఇదే మాట చెప్పింది. ఈ నేపథ్యంలో గద్దర్​ కుటుంబానికి అండగా ఉండాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకోవడానికి ప్రధాన కారకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి.

గద్దర్​ కుమారుడు సూర్యంను ఎన్నికల్లో పోటీ చేయించాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టింది రేవంత్​ రెడ్డే. హైకమాండ్​ కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. గద్దర్​ ఇతర పార్టీలతో కన్నా కాంగ్రెస్ తో ఎక్కువ సన్నిహితంగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కువ బాధ్యత  తీసుకున్నారు. 

ఆయన కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించారు. ఇక గద్దర్ మరణించిన తర్వాత రేవంత్ రెడ్డి హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అత్యవసర పనులను సైతం పక్కన పెట్టారు. గద్దర్ భౌతికకాయానికి అభిమానుల సందర్శన నిమిత్తం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను చూసుకున్నారు. గద్దర్ అంతిమయాత్రలోనూ తానే ముందుండి నడిపించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినా.. రేవంత్ రెడ్డే అన్నీ చూసుకున్నారని వార్తలు వినిపించాయి. 

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ఆ తర్వాత గద్దర్ సతీమణికి లేఖ రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గద్దర్ ను తన సొంత మనిషిలా చూసుకుంది. సోనియా గాంధీ కూడా గద్దర్​ మృతికి సంతాపం తెలియచేస్తూ ఆయన కుంటుంబానికి లేఖ రాశారు. విప్లవ రాజకీయాలను వదిలి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చిన తరువాత గద్దర్​ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అసలు తెలంగాణ రాగానే 2014 ఎన్నికల్లోనే కొందరు కేసీఆర్​కు పోటీగా గద్దర్​ను నిలబెట్టాలని అనుకున్నారు.

2018 ఎన్నికల్లోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. కాని కొన్ని కారణాలవల్ల వర్కవుట్​ కాలేదు.  ఇప్పుడు గద్దర్ చివరి కోరికను ఆయన కుమారుడి ద్వారా తీర్చాలని రేవంత్ అనుకుంటున్నారు.  హైకమాండ్ కూడా రేవంత్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్న గద్దర్​ రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలిశారు. తర్వాత కుటుబంంతో సహా ఢిల్లీకి వెళ్లి కలిశారు. భారత్ జోడో పాదయాత్రలో తెలంగాణకు చేరుకున్న రాహుల్ గాంధీకి ముద్దులిచ్చారు. తాను కాంగ్రెసులో చేరబోతున్నట్లుగా సూచనలు పంపించారు.

రేవంత్ రెడ్డి గద్దర్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు గద్దర్ మరణంతో ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్ ను కల్పించాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. టిక్కెట్ల కసరత్తులో చాలా కాలంగా ఉన్న రేవంత్  రెడ్డి కొన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో గద్దర్ కుమారుడి అభ్యర్థిత్వం స్వింగ్ ఓట్లను తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని రేవంత్ సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అక్కడ సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

దళిత వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గద్దర్ వారసుడు చట్టసభల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గద్దర్ కుమారుడు కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఉన్న సూర్యం ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తే వదులుకోనని చెబుతున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. 

అసెంబ్లీకి పోటీ చేయించలేకపోతే.. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీచేయించాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గద్దర్ పై ఒక్క దళిత వర్గాల్లోనే కాదు.. అభ్యుదయ భావాలు ఉన్న ప్రతి ఒక్కరిలో అభిమానం ఉంది. అది ఓట్ల రూపంలోకి మారితే కాంగ్రెస్‌కూ మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?