తిరుమల నడక దారిలో చిరుతల దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నడకదారిలో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు కాస్త ధైర్యం కలిగించేందుకు కర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులకు కర్రలు ఇవ్వడంతోనే వారి భద్రత విషయంలో టీటీడీ పక్కకు తప్పుకోవడం లేదని చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో భక్తులకు కర్రల పంపిణీ నిర్ణయంపై తలెత్తిన వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందన ఆసక్తికరంగా వుంది. అసలు ఆ వివాదం గురించి తెలియదని, అసలు వినలేదని ఆయన చెప్పడం విశేషం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి కర్రల వివాదం తెలియదనడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏదైనా వుందా? అనే చర్చకు తెరలేచింది.
తిరుమల నడక దారి పొడవునా కంచె వేయాలా? లేక సెక్యూరిటీని పెంచాలా అనేది టీటీడీ ఇచ్చే నివేదికపై ఆధారపడి వుంటుందన్నారు. అటవీశాఖలో సిబ్బంది కొరతలేదని ఆయన అన్నారు. ఇప్పటికే తిరుమల అడవుల్లో రెండు చిరుతలను బందించి జూకు తరలించినట్టు ఆయన చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి అటవీశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
టీటీడీ, అటవీశాఖ పరస్పరం సమన్వయంతో పనిచేస్తేనే భద్రత చర్యలను కట్టుదిట్టంగా చేపట్టొచ్చు.