మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అవినీతి కేసులో జైలు పాలు కావడానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు కావడం విశేషం. ఆ నాయకుడే సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మధు. ఈఎస్ఐలో భారీ కుంభ కోణం జరిగిందని మొట్ట మొదట గుర్తించడమే కాదు, దానిపై విచారణకు డిమాండ్ చేసిన నాయకుడు మధునే. టీడీపీలో కాస్త నోరెక్కువ అని పేరుగాంచిన నేతల్లో అచ్చెన్నాయుడుది అగ్రస్థానం.
అంతేకాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మంత్రిగా అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో దూషణలకు దిగేవాడు. అప్పటి నుంచి అచ్చెన్నాయుడిపై జగన్ ఓ కన్నేసి ఉంచాడు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు అచ్చెన్నాయుడి శాఖలో భారీ అవినీతి చోటు చేసుకుందంటూ సీపీఎం నాయకుడు మధు ఆరోపించడంతో పాటు ఆధారాలు కూడా ప్రభుత్వానికి సమర్పించారు.
తెలంగాణలో ఈఎస్ఐ స్కాం బయట పడిన నేపథ్యంలో…అలాంటి కుంభకోణమే ఏపీలో కూడా చోటు చేసుకుందంటూ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మధు ఈ ఏడాది జనవరి 10న సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అవినీతికి సంబంధించి అనేక ఆధారాలను పొందుపరిచారు. తెలంగాణ ఈఎస్ఐలో మోసానికి పాల్పడ్డ మెడికల్ కంపెనీలు ఏపీలోనూ అట్లే చేశాయని , విచారణ జరపాలని మధు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కోట్లాది రూపాయలు కార్మికుల సొమ్మును కొల్లగొట్టినట్టు ప్రభుత్వం దృష్టికి మధు తీసుకెళ్లారు. మధు లేఖపై జగన్ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. మధు లేఖపై వెంటనే స్పందించిన జగన్ సర్కార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తులో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర నిర్ధారణైంది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని దర్యాప్తులో తేలింది.
టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ల విధానంలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగు చూసింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్టు తేలింది. మందుల పరికరాల వాస్తవ ధర కంటే 136 శాతం అధికంగా సంస్థలు టెండర్లో చూపించినట్టు విచారణలో తేలింది. దీని ద్వారా అక్రమంగా రూ.85 కోట్లు అదనంగా చెల్లించినట్టు విచారణలో తేలింది.
నామినేషన్ ప్రాతిపదికన 3 లేదా 4 కంపెనీల నుంచే మందులు కొనుగోలు చేశారని , దీనికి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్న రాసిన లేఖే కీలకమని దర్యాప్తులో వెల్లడైంది. ఈ భారీ అవినీతిలో అచ్చెన్నాయుడి హస్తం ఉందని తేలడంతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో సీపీఎం మధు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నారు.