cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గులాబో సితాబో

సినిమా రివ్యూ: గులాబో సితాబో

చిత్రం: గులాబో సితాబో (హిందీ)
రేటింగ్: 2.75/5
బ్యానర్: రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్
తారాగణం: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్, బ్రిజేందర్ కాలా, స్రిష్టి శ్రీవాస్తవ తదితరులు
సంగీతం: షంతాను మొయిత్రా
కూర్పు: చంద్రశేఖర్ ప్రజాపతి
ఛాయాగ్రహణం: అవిక్ ముఖోపాధ్యాయ్
నిర్మాతలు: రోనీ లహిరి, షీల్ కుమార్
రచన: జూహీ చతుర్వేది
దర్శకత్వం: షూజిత్ సర్కార్
విడుదల తేదీ: జూన్ 12, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

‘దురాశ దుఃఖానికి చేటు’... అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదయిన షూజిత్ సర్కార్ తాజా చిత్రానికి ఇదే బేస్. ఓటిటి వేదికగా విడుదలయ్యే సినిమా/సిరీస్‌లకు క్రైమ్, మిస్టరీ, థ్రిల్స్ లాంటివి ప్రధాన కాన్సెప్ట్స్‌గా ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులని ఇన్‌స్టంట్‌గా ఎట్రాక్ట్ చేసేవీ, వారిని మరో ఆప్షన్ చూసుకోకుండా కూర్చోబెట్టేవీ అలాంటివే కనుక ఎక్కువ మంది ఆ అంశాలనే ఓటిటి కోసం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ‘గులాబో సితాబో’ ఖచ్చితంగా అలా అరెస్ట్ చేసే కాంటెంట్ కాదు. ఓల్డ్ స్కూల్ స్టోరీ టెల్లింగ్‌తో క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా ఇది. 

ఒక రాజమహల్‌ని సొంతం చేసుకోవచ్చుననే ఆశతో తనకంటే వయసులో పదిహేనేళ్లు పెద్దదయిన బేగమ్‌ని పెళ్లాడతాడు మీర్జా (అమితాబ్). డెబ్బయ్ ఎనిమిదేళ్ల వయసులో కూడా తనకి ఆ మహల్‌కి ‘ఓనర్’ కావాలనే కల తీరదు. ఇంకా తన భార్య చనిపోతే తానే ‘మాలిక్’ అవ్వవచ్చునని ఎదురు చూస్తుంటాడు. అతనికి మరో ధ్యాస ఉండదు, ప్రపంచంతో సంబంధముండదు. పేరుకి రాజయినా కానీ చిన్నా చితకా వస్తువులు తస్కరించడం, చిన్న పిల్లలతో వీధుల్లో డాన్సులు చేయించి సొమ్ము చేసుకోవడం, తన మహల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కిరాయిదారులు ఇచ్చే పదీ పరకా అద్దె మొత్తాలను సేకరించడం అతని జీవనాధారం. దురాశే కనుక ఆరడగుల ఎత్తుండి, దానికి దాదాపు ఎనిమిది దశకాల వయసుంటే ఆ రూపమెలా వుంటుందనే దానికి నిదర్శనంలా అనిపిస్తాడు మీర్జా. 

ఈ ప్రపంచంలో తనను ప్రేమించే వాళ్లంటూ ఉండరు. ఎన్నో లోపాలున్న వారికి కూడా ‘ఛీ.. ఇలాంటి మనిషేంటి ఇతను’ అనిపించేంత ‘చీప్’ పర్సనాలిటీ, బిహేవియర్. అయితే అతనిలోను కనిపించని సుగుణాలుంటాయి. ఉదాహరణకు తనకు ఇవ్వాల్సిన ముప్పయ్ రూపాయల అద్దె చెల్లించడానికి కూడా సాకులు వెతికే వాళ్లపై హుకుం చలాయించడు. ఓ పాప తన చెట్టుకి కాసిన మావిడికాయ తింటే... దానిని బలవంతంగా కక్కించిన వాడే, అదే పాపకు ఒంట్లో బాలేదంటే మాత్రం కాస్తయినా చలిస్తాడు. తను కోరుకున్న మహల్ కోసం అతను ఎలాగయినా భార్యని మట్టుబెట్టాలని అనుకోడు. ఆమె చనిపోవాలని మాత్రం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాడు. పైసా, పైసా కోసం పాకులాడుతాడే తప్ప తన జీవితం విలువెంత, తను కోరుకుంటోన్న మహల్ ఖరీదెంత అతనికి తెలియదు. ‘నీకంటే పదిహేనేళ్లు పెద్దావిడని ఏమి చూసి ప్రేమించావ్?’ అని అడిగితే... ‘ఆ మహల్ చూసి’ అని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ‘మరి ఆవిడ నీలో ఏమి చూసి వుంటుంది?’ అంటే ‘బహుశా నా యవ్వనం అనుకుంట’ అంటాడు. తన పాత్రల్లో పరివర్తన చూపించాలనేది దర్శకుడి ఉద్దేశం కాదు. రియాలిటీ అలా వుండదు. కరడు కట్టుకుపోయిన లక్షణాలు, గుణాలు (దుర్గుణాలు)... అలా మనిషితో పాటే కాటికి పోవాల్సిందే తప్ప పూర్తిగా మారిపోలేరు. ఈ విషయాన్ని షూజిత్ సర్కార్ చాలా ఎఫెక్టివ్‌గా చెప్తాడు. 

మీర్జా ఇంట్లో ఏడు దశకాలుగా అద్దెకు ఉంటోన్న కుటుంబాలలో ఒకటి బాంకే రస్తోగిది (ఆయుష్మాన్). తల్లి, ముగ్గురు చెల్లెళ్ల బాగోగులు చూసుకునే అతనో చిరు జీవి. పిండి మర ఆడించుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తుంటాడు. మీర్జాకి ఇచ్చే ముప్పయ్ రూపాయల అద్దె ఏదో సాకు చెప్పి ఎగవేయడం అతనికి అలవాటు. స్వార్ధానికి, ఆశకీ అతనూ అతీతుడు కాదు. కాకపోతే మీర్జా అంత లోభి కాదు, మరీ అతని స్థాయిలో ‘చీప్’గా వ్యవహరించడు. కానీ తనది కాని దానికోసం ఆశ పడతాడు. అందుకోసం ఏమి చేయడానికైనా వెనుకాడడు. మీర్జా, బాంకేల సంబంధం, ఒకరికొకరు గుణపాఠం చెప్పడం కోసం చేసే ప్రయత్నాలే ‘గులాబో సితాబో’ని నడిపించే ఇంధనం. ఈ ప్రయత్నంలో వాళ్ల జీవితాల్లోకి ఎవరెవరు వస్తారు, చివరిగా వారి కలల్ని మట్టుబెట్టి మరొకరు ఎలా లబ్ధి పొందుతారు లాంటివి దర్శకుడు షూజిత్ తనదయిన శైలిలో చెప్తాడు. 

ఏ పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం, దానిని సజీవంగా ప్రేక్షకుల కళ్ల ముందుకి తేవడం, మన మది ఫలకాలపై దానిని ముద్రించడం అమితాబ్‌కి ఎంత సునాయాసంగా వస్తుందనే దానికి మీర్జా పాత్ర పోషణ తాజా ఉదాహరణ. ప్రోస్థటిక్స్ సాయంతో అతికించిన ముక్కు, వయసు భారంతో కుంటుబడిన నడక... మీర్జా స్క్రీన్‌పై కనిపించిన కాసేపటికే అమితాబ్‌ని మరిచిపోయి మీర్జాని మాత్రమే చూస్తామంటే అది ఆయన ఘనమైన ప్రతిభకు తార్కాణం. ఆయుష్మాన్ ఖురానాలోను ఈ లక్షణాలు ఎక్కువే. మన చుట్టూ ఉండే పాత్రలను ఎంచుకుని హీరోలా కనిపించని పాత్రతో హీరో అయిన ఆయుష్మాన్ ఇందులో సపోర్టింగ్ రోల్ చేసాడు కానీ తను కనిపించిన సీన్స్‌లో ఎదురుగా అమితాబ్ ఉన్నా కానీ తన ముద్ర మాత్రం బలంగా వేస్తాడు. ‘‘నేనే గవర్నమెంట్’’ అనే విజయ్ రాజ్, ‘‘ఇంట్లో కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతా కాబట్టి నమ్మకానికి ప్రతీక లాంటివాడిని’’ అని చెప్పుకునే బ్రిజేంద్ర కాలా తమ నటనతో ఈ చిత్రానికి అదనపు బలమయ్యారు. అలాగే అవకాశవాదానికి అద్దంలాంటి పాత్రలో స్రిష్టి శ్రీవాస్తవ కూడా మెప్పించింది. పాత్రలు, పాత్రధారుల మీదే ఆధారపడిన ఈ కథకు నటీనటుల ఎంచలేని ప్రతిభ పెద్ద ప్లస్ అయింది.

లక్నో సిటీని కథాగమనంలో భాగం చేస్తూ చూపించే ఛాయాగ్రహణం, అర్థవంతమయిన సాహిత్యం, కథాగమనానికి అడ్డు పడని సంగీతం, ఆకట్టుకునే సంభాషణం, అద్భుతమైన కళా దర్శకత్వం దర్శకుడి ఆలోచనలకు రూపమివ్వడంలో దోహదపడ్డాయి. అయితే ఒకే పాయింట్‌పై తచ్చాడే కథనం ఎంతకూ ముందుకు కదలకపోవడం, మందకొడి గమనం అక్కడక్కడా విసిగించేస్తాయి. అటెన్షన్ స్పాన్ తక్కువయిన ఈ తరం సినిమా ప్రేక్షకుల అటెన్షన్‌ని చివరంటా నిలుపుకునే లక్షణాలు బహు తక్కువగా వున్న ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకులు రిమోట్ కోసం వెతక్కుండా చేస్తుందా అంటే ఆ నమ్మకం తక్కువే. స్కూల్లో నాన్ డీటెయిల్డ్ పుస్తకాల్లోని నీతి కథలాంటి స్టోరీ ఇది. పాత్రలు, పరిస్థితులు, ప్రవర్తనలు ప్రధానంగా సాగుతుంది తప్ప సినిమాకు అవసరమయిన బలమైన సంఘటనలు, ఆకట్టుకునే ఘట్టాలు ఉండవు. అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు మామూలుగా కంటే కాస్త ఎక్కువ ఓపిక కావాలి. ఆ పాత్రలతో ట్రావెల్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక చిన్నపాటి అనుభూతి దక్కుతుంది. ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలు తెలుస్తాయి. 

మరీ మనుషులు ఇంత వాస్తవాతీతంగా ఉంటారా? కనీసం దేని విలువ ఎంతో తెలియకుండా బ్రతికేస్తుంటారా? అసలు ఇది ఇప్పటి కథేనా? అనిపించవచ్చు. ఇదంతా రియాలిటీకి దూరంగా ఉందనే భావన కలగవచ్చు. కానీ తను పండించే పంట పట్టణాల్లో ఎంతకు అమ్ముడవుతుందనేది పట్టకుండా కేజీకి రూపాయి వచ్చినా చాలనుకునే రైతులే లక్షలలో వున్నారు. చీమల పుట్టలను పాములు ఆక్రమించినట్టు ఎప్పుడూ పేదవాడు తనకొచ్చిన తక్కువతో సంతృప్తి పడిపోతే సంపన్నుడు దానిని సొమ్ము చేసేసుకుంటూ వుంటాడు. చివరి సన్నివేశంతో దర్శకుడు షూజిత్ ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తాడు. సహనంతో చూడాలి కానీ ‘గులాబో సితాబో’లో జీవిత పాఠాలు చాలనే నేర్చుకోవచ్చు. 

బాటమ్ లైన్: అమితాబ్ నట సౌరభం గుభాళింపు!

గణేష్ రావూరి

 


×