ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్‌పై హీరో మంచు విష్ణు పరోక్షంగా పంచ్ విసిరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’కు సొంత భవనం అవసరం లేదని బండ్ల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ అన్నట్టుగా మంచు విష్ణు తనదైన స్టైల్లో స్పందించారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ కు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష బరిలో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు బరిలో నిలబడనున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఉన్నారు.
తమకు అవకాశం ఇస్తే ‘మా’కు శాశ్వత భవనం, అలాగే అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామనే హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ మద్దతుదారుడైన బండ్ల గణేశ్ ‘మా’ భవానికి సంబంధించి సంచలన కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది. ముందుగా బండ్ల అన్నమాటలేంటి, అలాగే మంచు విష్ణు ఏమన్నారో తెలుసుకుందాం.
‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్‌కు వ్యతిరేకిని. ఇప్పుడు అది కట్టాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ కట్టేందుకు ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్కే వేరు. ‘మా’కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’ అని బండ్ల తన మార్క్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతానికి వస్తే… మంచు విష్ణు కామెంట్స్‌ను బండ్ల గణేశ్‌కు కౌంటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగని విష్ణు ఎక్కడా బండ్ల పేరు ప్రస్తావించలేదు. ట్విటర్లో షేర్ చేసిన వీడియాలో మంచు విష్ణు ఏమన్నారంటే…
‘మా’కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని. అది త్వరలో నిజం కానుంది. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించా. వాటిల్లో ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసు కుంటాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘మా’కి శాశ్వత భవనం నిర్మిస్తానని మరోసారి మంచు విష్ణు పునరుద్ఘాటించినట్టైంది. మొత్తానికి ‘మా’ ఎన్నికల్లో శాశ్వత భవన నిర్మాణం ప్రధాన ఎజెండాగా మారిందని చెప్పొచ్చు.