కర్నూలు జిల్లా అంతా ఒక ఎత్తైతే, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం ప్రత్యేకం. అక్కడ ఇంత కాలం భూమా కుటుంబం చెప్పిందే వేదంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబం హవా రోజురోజుకూ దిగజారిపోతోంది. పైగా భూమా కుటుంబంలోనే వ్యక్తిగత, రాజకీయ విభేదాలున్నాయి. మరీ ముఖ్యంగా భూమా దంపతుల ఆకస్మిక మృతితో ఆ కుటుంబంలో ఐక్యతకు బీటలు పడ్డాయి.
భూమా నాగిరెడ్డి అన్నదమ్ముల పిల్లల మధ్య సత్సంబంధాలను కాసేపు పక్కన పెడితే …భూమా నాగిరెడ్డి పిల్లల్లోనే స్పష్టమైన విభజన వచ్చింది. దీంతో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఒకవైపు, భూమా మౌనిక ఒక్కటి ఒకవైపు అన్నట్టుగా తయారైంది.
ఈ నేపథ్యంలో భూమా అనుచరుల్లో కూడా ఒక రకమైన నిరాశనిస్పృహలున్నాయి. మరోవైపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి బీజేపీ నాయకుడిగా క్రమంగా బలపడుతున్నారు. దీంతో భూమా అఖిలప్రియ, కిషో ర్‌రెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్య నడుస్తోంది.
భూమా నాగిరెడ్డి పిల్లలు అఖిలప్రియ, ఆమె తమ్ముడు, భర్త వివిధ కేసుల్లో ఇరుక్కోవడం, పరారీలో ఉంటుండం వారికి రాజకీయంగా నెగెటివిటీ తీసుకొస్తోంది. దీంతో జైలు కావాలంటే అఖిలప్రియ వెంట వెళ్లాలని, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కావాలంటే తమ నాయకుడు కిషోర్‌రెడ్డి వైపు నిలవాలని ఆయన సన్నిహితులు ఆప్షన్ ఇస్తుండడం గమనార్హం. దీంతో భూమా అనుచరులు కూడా సంశయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు భూమా అనుచరులు దూరంగా ఉంటున్నారు.
ఈ రాజకీయ పరిణామాలను భూమా కిషోర్ రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారు. తానే నిజమైన భూమా వారసుడినని మాటల్లో కాకుండా, చేతల్లో చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మెజార్టీ భూమా వర్గీయులంతా కిషోర్ వెంట నడవడం …కొత్త సమీకరణగా చెప్పుకోవచ్చు. ఇది సహజంగానే అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌లకు పుండుమీద కారం చల్లినట్టవుతోంది. దీంతో ప్రత్యర్థుల కంటే అన్న కిషోర్‌రెడ్డిపైనే భూమా అఖిల, జగత్‌విఖ్యాత్ రగిలిపోతున్నారు.
రెండురోజుల క్రితం బెయిల్‌పై ఆళ్లగడ్డలో అడుగుపెట్టిన జగత్‌విఖ్యాత్, అఖిల భర్త భార్గవ్‌రామ్ తిరిగి తమ అనుచరులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భూమా అనుచరులను ఇంటికి పిలిపించుకుని మీరు టీడీఫా? బీజేపా? ఏదో ఒకటి తేల్చుకోవాలని గట్టిగా చెబుతున్నారని సమాచారం. తాము టీడీపీ, బీజేపీ…రెండూ కాదని, భూమా అనుచరులమని చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారని తెలిసింది. దీంతో భూమా అఖిలప్రియ, జగత్, భార్గవ్‌రామ్‌లకు దిక్కుతోచడం లేదని చెబుతున్నారు.
భూమా కిషోర్‌రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారని అఖిలప్రియ, జగత్‌విఖ్యాత్ నిలదీస్తున్నట్టు సమాచారం. కిషోర్ కూడా భూమా వారసుడే కదా? అని కార్యకర్తలు ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కిషోర్‌ను అన్నగా భావించడం లేదని, రాజకీయం రాజకీయమే, పేకాట పేకాటే అని భూమా జగత్, అఖిల తెగేసి చెబుతున్నారని సమాచారం. అయితే భూమా కిషోర్ వాదన మరోలా ఉంది. అసలు భూమా కుటుంబానికి అఖిలప్రియతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భర్త భార్గవ్‌రామ్ ఇంటి పేరు మద్దూరితో అనుబంధమే తప్ప, భూమాతో ఏంటి సంబంధం అని ఆయన ప్రశ్నిస్తుండడం గమనార్హం.
మద్దూరి అఖిలప్రియగా బరిలో నిలిస్తే మంచిదని ఆయన సలహాలిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరులో చివరికి విజేతగా ఎవరు నిలుస్తారనే ప్రశ్నపై కర్నూలు జిల్లాలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.