నిండు నూరేళ్ళూ జీవించాలి అని ఎవరినైనా దీవిస్తాం కానీ అత్యధిక శాతం జనాభా సెంచరీ కొట్టినది ఎపుడూ జరగదు. ఎవరు బతికారు మూడు యాభైలు అని ఒకపుడు మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఇపుడు కాలం చూస్తే ఎవరు బతికారు మూడు పాతికలు అనాల్సి వస్తోంది.
మరి ఇలాంటి కలి కాలంలో, కాని కాలంలో కరోనా కాలంలో కూడా సెంచరీని దాటి మరీ బతికిన వారిని గొప్పవారుగానే చూడాలి. అలా 102 ఏళ్ళు బతికిన వృద్ధుడు ఒకరు కాలం చేశారు.
ఆయన విశాఖ జిల్లా భీమిలి మండలం లక్ష్మీపురం పంచాయతీకు చెందిన లచ్చుబుగత నారాయుడు. వ్యవసాయమే ఆయన వృత్తి. చివరి క్షణం వరకూ పొలం పనులు చూస్తూనే గడిపాడు 1919లో జన్మించిన నారాయుడు 2021 వరకూ బతకడం అంటే రికార్డుగానే చూడాలి.
ఇక అతనికి ఒక కుమార్తెతో పాటు, అయిదుగురు కుమారులు ఉన్నారు. 16 మంది మనుమలు, మనవరాళ్ళు, 20 మంది దాకా ముని మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నారాయుడు మరణం ఆ కుటుంబానికి విషాదం అయినా వందను దాటి బతికారు అంటూ ఆ ఊరి వారు అంతా గర్వంగా చెప్పుకుంటున్నారు.
అందుకే అతని అంత్య క్రియలకు ఊరు మొత్తం హాజరై ఘన నివాళి అర్పించింది. ఇక్కడ చిత్రమేంటి అంటే అలా నడుస్తూ పనిచేసుకుంటూనే నారాయుడు మరణించడం. కేవలం వృద్ధాప్యం తప్ప మరే అనారోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. నిజంగా పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలి అనుకునేవారికి ఆయన స్పూర్తిగానే చెప్పాలి.