ఉప ఎన్నిక ఆలస్యం … టీఆర్ఎస్ కు లాభం !

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమవుతుందా ? ఇప్పుడు తెలంగాణలో ఇది చర్చనీయాంశమైంది. అన్ని పార్టీల నాయకులు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేదానికంటే ముందు నోటిఫికేషన్…

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమవుతుందా ? ఇప్పుడు తెలంగాణలో ఇది చర్చనీయాంశమైంది. అన్ని పార్టీల నాయకులు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేదానికంటే ముందు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇక ఉప ఎన్నిక బాగా ఆలస్యమైతే ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదివరకు ఆగస్టు 30లోపు ఉపఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నారు.
  
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తమ అభిప్రాయం ఈనెల 30లోపు తెలపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి కదలికలు లేవు. దీంతో ఈనెల 30వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. దాదాపు సెప్టెంబర్ 15లోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం లేదని తేలిపోయింది. 

సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో హుజూరాబాద్ కు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమవుతున్న కొద్దీ ఎవరికీ లాభమని ప్రశ్నించుకుంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకే లాభమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అయితే ఆలస్యమయ్యే కొద్దీ హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీకి ఇబ్బందికరంగా మారగా టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందంటున్నారు విశ్లేషకులు. ఈ ఉప ఎన్నిక ఆలస్యమయ్యే కొద్దీ హుజూరాబాద్ లో పరిస్థితులను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది.

స్థానిక పరిస్థితులు చక్కదిద్దుకునేందు ప్లాన్ చేసుకుంటున్నారు. హుజురాబాద్‌లో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడానికి ప్లాన్ చేశారు. గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లు వేయడంతో పాటు, కొత్త పెన్షన్ లు, కొత్త రేషన్ కార్డులు, యాదవులకు గొర్రెల పంపిణీ, దళితులకు దళితబంధు ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఏదో ఒక రూపంలో దగ్గర చేసుకునేందుకు టీఆర్ఎస్‌కు కావాల్సిన సమయం ఉప ఎన్నిక ఆలస్యం కావడం ద్వారా దొరికింది. టీఆర్ఎస్ అధిష్టానం గెలుపుపై ధీమాగా ఉంది.

మరోవైపు దళితబంధుని హుజూరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ మరో 20 రోజులలో మళ్ళీ హుజూరాబాద్ లో పర్యటిస్తానని చెప్పారు. దీంతో హుజురాబాద్‌లో పార్టీకి ఇంకా ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిని సరిచేసి అంతా సెట్ రైట్ చేసేందుకు సిద్దమవుతున్నారట గులాబీ బాస్.

నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ గత కొన్ని నెలలుగా అక్కడ రాజకీయ వేడి కొనసాగింది. ఈటల పాదయాత్ర, కాంగ్రెస్‌కు రాజీనామ చేసిన కౌశిక్ టీఆర్ఎస్‌లో చేరడం, తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను కేసీఆర్ ఖరారు చేయడం, దళిత బంధు పథకం ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ రావడం.. ఇలా అక్కడి వాతావరణం వేడెక్కింది.కానీ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ సందడి కనిపించడం లేదంటున్నారు.

ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు నెమ్మదించాయి. అందరూ ప్రెస్‌మీట్లతోనే సరిపెడుతున్నారు. మొన్నటివరకూ హోరెత్తిన ప్రచారం ఇప్పుడు మందగించింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి కానీ నేతల ప్రచారం మాత్రం లేదు. కేసీఆర్ దళిత బంధు ప్రారంభించిన తర్వాత నాయకులంతా హైదరాబాద్ వెళ్లిపోయారు. 

ఈ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్న హరీష్ రావు కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకూ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు చక్కబెట్టేలా ఉన్నారు.  ఆ నియోజకవర్గంలో నియమించిన ఇంచార్జులు కూడా సొంత ఊళ్ల బాట పట్టారు.

మరోవైపు పాదయాత్ర ప్రారంభించి మధ్యలో మోకాలికి శస్త్రచికిత్స కారణంగా విరామం తీసుకున్న ఈటల కూడా నెమ్మదించినట్లే కనిపిస్తోంది. ఆయన కూడా ప్రచారాన్ని పూర్తిగా తగ్గించారు. ఆయన భార్య జమున కూడా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు తెరమీదికి వచ్చినా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.