కెమెరాలు కనిపించగానే హీరోయిన్లు పోజులు ఇవ్వడం, ఫొటోలకు స్టిల్స్ ఇవ్వడం కామన్. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా అదే పని చేసింది. కాకపోతే ఆ హడావిడిలో మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయింది. మాస్క్ మరిచిపోతే ఏమౌతుంది అనుకోవద్దు. పాయల్ పై ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసు నమోదైంది.
అవును.. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో పాయల్ రాజ్ పుత్ పై పోలీస్ కేసు నమోదైంది. రీసెంట్ గా అక్కడ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరైంది పాయల్. రిబ్బన్ కట్ చేసింది, దీపం వెలిగించింది, ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. అయితే ఈ క్రమంలో ఆమె మాస్క్ లేకుండా కనిపించింది.
ఫొటోలకు అడ్డం ఎందుకని ఆమె మాస్క్ తొలిగించిందా లేక నిజంగానే మరిచిపోయిందా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఓ వ్యక్తి మాత్రం ఆమె వ్యవహారశైలిపై పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదుచేశాడు. ఫిర్యాదు పరిశీలించిన కోర్టు, పాయల్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించడం, ఆ వెంటనే కేసు ఫైల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. మీడియాలో దొరికిన ఫొటోలు, వీడియోల ఆధారంగా పాయల్ తో పాటు సదరు షాపు యజమాని, అతడి భార్యపై కూడా కేసు నమోదైంది.
ఆర్ఎక్స్ 100 ఇచ్చిన ఊపును క్యాష్ చేసుకోలేకపోయింది పాయల్. ఏకంగా వెంకీ సరసన నటించినప్పటికీ ఆమెకు కలిసిరాలేదు. దీంతో చిన్న చితకా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ సరసన 2 సినిమాలు చేస్తోంది. అటు పంజాబీ సినిమాల్లో కూడా నటిస్తోంది.