ఉద్యోగులు ఓటీ చేస్తే అదనపు జీతం వస్తుంది. అదే హీరోయిన్లు ఓటీ చేస్తే రెమ్యూనరేషన్ కింద మరింత డబ్బు వస్తుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సినిమాలు అంగీకరిస్తుంటారు హీరోయిన్లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే. అయితే ఇదే విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాస్త పద్ధతిగా చెబుతోంది. పారితోషికం మేటర్ ఎత్తకుండా, పని గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.
“కరోనా/లాక్ డౌన్ వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఎంతోమంది పని కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు పని దొరికింది. వరుసపెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇలా పని దొరకడం నా అదృష్టం. సో.. ఓవర్ టైమ్ అనేది నాకు పెద్ద సమస్య కాదు.”
తాజాగా అక్షయ్ కుమార్ సరసన మిషన్ సిండ్రిల్లా అనే సినిమాలో నటించబోతోంది రకుల్. తమిళ్ లో హిట్టయిన రాట్ససన్ (తెలుగులో రాక్షసుడు) సినిమాకు రీమేక్ ఇది. నిన్ననే లండన్ లో ఈ సినిమా లాంఛ్ అయింది. ఈ ప్రాజెక్టుతో పాటు మరో 3 హిందీ సినిమాలు చేస్తోంది రకుల్.
ఇలా వరుసపెట్టి షూటింగ్స్ చేయడం ఇబ్బందిగా అనిపించడం లేదా అనే ప్రశ్నకు పై విధంగా స్పందించింది రకుల్. పని చేయడం తనకు ఆనందాన్నిస్తుందన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ ను ఆమె స్టార్ట్ చేయబోతోంది. అక్టోబర్ 8న కొండపొలం రిలీజ్ అవుతుంది.