షాకుల మీద షాకులిస్తున్న పవన్..!

ఏపీలో జరగబోతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతు కోరింది. ఆ పార్టీ మద్దతుతో అక్కడ అభ్యర్థిని నిలబెడతామంటూ ప్రకటనలిచ్చింది. తీరా పవన్ కల్యాణ్…

ఏపీలో జరగబోతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతు కోరింది. ఆ పార్టీ మద్దతుతో అక్కడ అభ్యర్థిని నిలబెడతామంటూ ప్రకటనలిచ్చింది. తీరా పవన్ కల్యాణ్ బీజేపీ గాలి తీసేశారు. అక్కడ పోటీ చేయబోమని చెప్పేశారు. గతంలో బద్వేలులో కూడా ఇలాగే మిత్రపక్షానికి షాకిచ్చారు, ఇప్పుడు మరో షాక్..

మిత్రపక్షమని పైకి చెప్పుకుంటారే కానీ ఏపీలో ఎప్పుడూ ఇరు పార్టీలు కలసి పనిచేసిన దాఖలాలు లేవు, కలసి కనీసం నిరసనల్లో పాల్గొనలేదు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదు. అజెండా ఒకటే అనేది పైమాటే కానీ, పవన్ కల్యాణ్ ఎప్పుడూ బీజేపీని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. పైపెచ్చు.. తాజా మీటింగ్ లో తన సంబంధాలన్నీ కేంద్ర నాయకత్వంతోనే అని తేల్చి పారేశారు. రాష్ట్ర నాయకులతో తనకు పెద్దగా పరిచయాలు కూడా లేవన్నారు.

తనకు తానుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదంటూ టీడీపీతో పొత్తుకి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని, తేల్చి చెబుతోంది. ఈ సంబంధ బాంధవ్యాలపై ఇంకా క్లారిటీ లేని ఈ సమయంలో ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో మరోసారి బీజేపీకి షాకిచ్చారు పవన్ కల్యాణ్. పోటీకి దూరం అని చెప్పేశారు.

ఇక్కడ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం కమిటీ వేసి వడపోత మొదలుపెట్టింది బీజేపీ. బరిలో దిగేందుకు ఎవరూ ఆసక్తిగా లేరు, ఈ దశలో జనసేన కలిసొస్తుందేమోనని ఆశపడుతోంది బీజేపీ. కానీ పవన్ ఆ ఆశలపై నీళ్లు చల్లారు. బీజేపీ నుంచి ఎవరైనా సంప్రదించారా లేదా అనే విషయం కూడా ఆయన చెప్పలేదు. మేం పోటీకి దూరం, ఇదే మా విధానం అన్నారు.

మరి పోటీకి దూరంగా ఉండే మిత్ర పక్షాన్ని బీజేపీ ఎన్నాళ్లు భరించాలి, ఎందుకు భరించాలి. ఇంకా జనసేన మా మిత్రపక్షమేనని చెప్పుకోవడం బీజేపీకే సిగ్గుచేటని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్, చంద్రబాబు వెంట పడుతున్నా.. బీజేపీ మాత్రం పవన్ ని వెనకేసుకొస్తోంది. ఇంతకంటే క్లారిటీగా ఇక పవన్ చెప్పలేరు, చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో బీజేపీ లేదు.