తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మిక శాఖా బాధ్యతలు కూడా చూసిన ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. ఆ శాఖలో కూడా దండుకోవచ్చనే విషయాన్ని నిరూపించారు. కార్మిక శాఖ అంటే కార్మికులు, కష్టాలు తప్ప రాబడి ఉండదనే అభిప్రాయాలు ఏవైనా ఉంటే వాటిని తుడిచేశారు ఈ మాజీ మంత్రి. ఈఎస్ఐ లో అడ్డగోలుగా భారీ స్కామ్ ను చేశారు అచ్చెన్న అని అవినీతి నిరోధక శాఖ అధికారులు తేల్చారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.975 కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోలు ఆసాంతం బోగస్ గానే సాగిందని సమాచారం. ప్రభుత్వం మందుల కొనుగోలుకు 293 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించినా, ఆ మొత్తం చాలదని దాదాపు మరో 700 కోట్ల రూపాయల మొత్తంతో మందులు కొన్నారని ఏసీబీ పేర్కొంది. స్కామ్ చేసుకుని దండుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని పెంచారని సమాచారం. ఎలాంటి టెండర్లు లేకుండా ఈ ఒప్పందాలన్నీ కుదుర్చుకున్నారట.
ఆఖరికి బయోమెట్రిక్ మిషన్ల కొనుగోలు కూడా కుంభకోణం చేశారట. 16 వేల రూపాయల స్థాయి మిషన్ కొనుగోలుకు 70 వేల రూపాయల మొత్తాలను వెచ్చించి అడ్డగోలుగా దోచారని ఏసీబీ ధ్రువీకరించింది.
అలాగే ల్యాబ్ కిట్లు, ఇంకా కేవలం రసీదుల్లో మాత్రమే చూపి మందులు కొనకపోవడం..ఈ వ్యవహారంపై ఏసీబీ చాన్నాళ్లుగా విచారణ చేస్తూ వచ్చింది. కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో..ఆ వైద్యాధికారి ఇచ్చిన పూర్తి సమాచారం ఆధారంగానే అచ్చెన్నాయుడి అరెస్టు జరిగినట్టుగా సమాచారం.