మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఉత్తరాంధ్రలో కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఈరోజు ఉదయం టెక్కలిలో అచ్చెన్నాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అట్నుంచి అటు విజయవాడకు తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్టయ్యారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు. ఆ సమయంలోనే ఈ భారీ కుంభకోణం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈఎస్ఐకు సంబంధించి 975 కోట్ల మందుల్ని కొనుగోలు చేయగా.. అందులో వంద కోట్ల రూపాయల మేరకు నకిలీ బిల్లుల్ని గుర్తించారు అధికారులు. మంత్రి ప్రమేయంతోనే ఈ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఈమధ్య ఓ నివేదిక విడుదల చేసింది.
అయితే ఈ కుంభకోణం వంద కోట్లతో ఆగిపోలేదు. మందుల కొనుగోళ్లకు ప్రభుత్వం 293 కోట్లు కేటాయిస్తే.. అదనంగా బిల్లులు చూపించి 404 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించారనేది ప్రధానమైన ఆరోపణ.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. అవసరమైతే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నిస్తామని ప్రకటించారు అధికారులు.