టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ గండం నుంచి గట్టెక్కే దారేది? ఏపీ కేబినెట్ గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశం సంచలన నిర్ణయానికి వేదికైంది. టీడీపీ సర్కార్‌లో చోటు చేసుకున్న అవినీతిపై ఎవరూ ఊహించని విధంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ప్రధాన ప్రతిపక్షానికి గట్టి షాక్ ఇచ్చినట్టైంది.
చంద్రబాబు హయాంలో పైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. అనంతరం మంత్రివర్గం తీర్మానం మేరకు ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో నిందితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన బ్లాక్‌లిస్ట్‌లోని టెరాసాఫ్ట్‌కు గత ప్రభుత్వ నిబంధ నలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ బాబు ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణలో చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర ఏంటనేది తేలుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే చంద్రబాబు భయపడ్డట్టే జరుగుతోంది. జగన్ వ్యవహార శైలి ఏంటో అందరి కంటే చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే తనను ఊరికే వదిలి పెట్టరని చంద్రబాబు ముందు నుంచే ఓ అభిప్రాయంతో ఉన్నాడు. సీబీఐ లాంటి విచారణతో తనను ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ వెనుకాడదని బాబు ఓ నిర్ధారణకు రావడం వల్లే…అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి మోడీ-అమిత్‌షా ఆశీస్సుల కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు.
అవకాశాలను కల్పించుకుని మరీ మోడీ, అమిత్‌షాలను, కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేందుకు చంద్రబాబు చేసిన , చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. కానీ అక్కడి నుంచి పాజిటివ్ సంకేతాలు రావడం లేదు. దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి కారణం భవిష్యత్‌లో తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టే విచారణను అడ్డుకునేందుకు ప్రధాని, హోంమంత్రి అండదండల కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం చంద్రబాబు రాజకీయంగా ఏకాకి. ఇటు కేంద్ర సర్కార్‌తో తెగే వరకు లాగి…అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ వ్యక్తిగత వైరం పెట్టుకుని “పాపం” అనే వాళ్లు లేకుండా చేసుకున్నారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరగాల్సిందే అనే వాళ్లే తప్ప…జాలి చూపేవాళ్లు కరువయ్యారు.
సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ, అమిత్‌షాలకు తొడకొట్టిన చంద్రబాబు…నేడు వాళ్లెదుట పాహిమాం పాహిమాం అంటూ మోకాళ్లపై నిలిచి ప్రాథేయ పడడం విచిత్రంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సీబీఐ విచారణలో చంద్రబాబు పరిస్థితి ముందుకు పోతే నుయ్యి…వెనక్కి పోతే గొయ్యి అనే సామెత చందానా తయారైంది. ఒకవేళ సీబీఐ విచారణ చేపడితే తన పాలనలో ఏమేమి బాగోతాలు బయటపడతాయో అనే భయం…ఒక వేళ న్యాయ స్థానాల ద్వారా అడ్డుకుంటే…అదిగో చూడండి బాబు ఎప్పట్లాగే అసలు విచారణకే భయపడుతున్నాడనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే విచారణ చేయకుండానే బాబు దోషిగా నిలబడినట్టు అవుతుంది.
సీబీఐ విచారణలో ఏం తేలుతుందనే విషయం పక్కన పెడితే…71 ఏళ్ల వయసులో చంద్రబాబుపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపడం మాత్రం ఖాయం. అనుక్షణం టెన్షన్‌కు గురి కావాల్సిన దుస్థితి. ఫైబర్‌గ్రిడ్ విషయంలో లోకేశ్ ఇరుక్కునే అవకాశాలు లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మున్ముందు సీబీఐ దర్యాప్తు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.