జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బహుశా ఆయన సోదరుడు చిరంజీవి మద్దతు అవసరం లేకపోవచ్చని, ఆయనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మద్దతే సరిపోతుందని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.
జనసేన రాజకీయానికి చిరంజీవి మద్దతు పలికిన నేపథ్యంలో.. మీడియా అడిగిన ప్రశ్నకు కొడాలి నాని ఈ విధంగా స్పందించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు పరస్పరం మద్దతు ప్రకటించుకుంటూ ఉన్నారని.. ఇక చిరంజీవి మద్దతు అవసరం పవన్ కల్యాణ్ కు ఉండకపోవచ్చని కొడాలి స్పందించారు.
పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడుగా పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వాణి వినిపిస్తోంది. దత్తపుత్రుడు అనే మాటే పవన్ కల్యాణ్ కు మంటెక్కిస్తోంది కూడా. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కూడా! ఈ విషయాన్ని గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు అనే మాటను కాయినింగ్ చేసుకుని పవన్ ను ఎద్దేవా చేస్తోంది.
పవన్ కల్యాణ్ ఏం స్పందించినా.. అదంతా చంద్రబాబు అవసరం మేరకే ఉంటోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆయుధం అవుతోంది. చిరంజీవి ప్రస్తావన వచ్చినా.. చంద్రబాబు మద్దతు సరిపోదా! అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.
ఇక అమరావతి ఉద్యమం కొంతమంది కమ్మ కులస్తుల పంచాయతీ అని మరోసారి ఎద్దేవా చేశారు కొడాలి నాని. తనను కుల బహిష్కరణ చేస్తామంటూ ఓడిపోయిన పది మంది కమ్మ కుల నేతలు గుడివాడలో హల్చల్ చేశారన్నారు. రెండు వందల యేళ్లు అయినా.. అమరావతి గ్రాఫిక్స్ ను నిజంగా నిర్మించడం సాధ్యం కాదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు చెబుతున్న మాటలను పట్టించుకోనక్కర్లేదన్నారు.
ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన వైనం పై స్పందిస్తూ… రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే సరికే కేసీఆర్ కు ప్రధానమంత్రి కావాలే ఆశ పుట్టి ఉండవచ్చని..రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్నట్టుగా కొడాలి నాని చెప్పుకొచ్చారు.