ఎన్నికల కమిషన్ వద్ద శివసేనకు చెందిన రెండు గ్రూపులకూ మధ్య పోరాటం కొనసాగుతోంది. శివసేన అధికారిక గుర్తింపు తమదేనంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇటు షిండే వర్గం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అలాగే ఈసీ వద్ద ఎవరి వాదనలు వారు వినిపించారు. ఈ విషయంలో ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోవద్దంటూ సీఈసీని సుప్రీం ఆదేశించింది. ఇంతలోనే మహారాష్ట్రలో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో.. గుర్తు విషయంలో ఇరు వర్గాలూ ఈసీ వద్ద పంచాయతీ పెట్టాయి.
ఈ నేపథ్యంలో అటు శివసేన పార్టీ పేరును, దాని గుర్తును ఈసీ ప్రీజ్ చేసింది. ఇరు పక్షాల్లో దేనికీ అధికారిక గుర్తింపును ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన గుర్తు గురించి ఇరు వర్గాలూ ఈసీ వద్ద ప్రతిపాదనలు పెట్టాయి. విశేషం ఏమిటంటే.. ఈ ఇరు వర్గాలూ దాదాపు ఒకే గుర్తులను డిమాండ్ చేస్తూ ఈసీ వద్దకు చేరాయి.
ముందుగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. తమకు త్రిశూలం, ఉదయించే సూర్యుడు లేదా కాగడా గుర్తును కోరిందట. వీటిల్లో త్రిశూలం గుర్తును మతపర చిహ్నంగా భావించి ఈసీ తిరస్కరించింది. ఉదయించే సూర్యుడు తమిళనాడుకు చెందిన డీఎంకే గుర్తుగా ఉంది. దీంతో దాన్నీ కాదంది. అయితే కాగడా గుర్తు మాత్రం ఉద్ధవ్ క్యాంపుకు దక్కింది.
ఇక షిండే వర్గం కూడా త్రిశూలం గుర్తును కోరింది. దాంతో పాటు ఉదయించే సూర్యుడు, ఆ పై గద గుర్తును ఆ గ్రూపు కోరింది. ఈ మూడింటికీ ఈసీ నో చెప్పింది. త్రిశూలం, గద గుర్తులకు మతపరమైన ప్రాధాన్యత నేపథ్యంలో.. ఆ గుర్తులను కేటాయించడానికి నిరాకరించింది. అలాగే డీఎంకే గుర్తును కూడా ఈ క్యాంపుకు కేటాయించలేదు.
ఈ మూడు గుర్తులూ కుదరవని, కొత్తగా వేరే మూడు గుర్తులను తమ ముందు ఉంచాలంటూ షిండే క్యాంపుకు ఈసీ ఆదేశించింది. మొత్తానికి ఉద్ధవ్ గ్రూపుకు ఒక గుర్తు లభించగా.. షిండే గ్రూపు మాత్రం ఇంకా సంపాదించలేకపోతోంది.