బీజేపీ నేతల ఘాటు విమర్శలతో రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో పౌరుషం తన్నుకొచ్చింది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయంగా కాక రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రెండోదఫా పాదయాత్ర కొనసాగుతోంది. అరసవెల్లి వరకూ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలు విమర్శలకు పదును పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఏకంగా రాజీనామా చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు రాజీనామా చేస్తామంటున్నారని, వారిలా రాయలసీమ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడ్డం లేదని బీజేపీ నేతలు టీజీ వెంకటేష్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై పాణ్యం ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాయలసీమ కోసం రాజీనామాలే కాదు, ఏమైనా చేస్తామని బీజేపీ నేతలకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని, సీఎం జగన్ నేతృత్వంలో తమ ప్రాంతం పురోభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. కర్నూలుకు హైకోర్టు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.