తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ థ్యాంక్స్ చెప్పారు. దీనికి కారణం…మూడు నెలల సమయంలోనే ఎన్వీ రమణ కోరుకున్నట్టుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రం (ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటు చేయడం. ఈ సెంటర్‌ను శుక్రవారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలోనూ, హైదరాబాద్ చరిత్ర లోనూ ఈ రోజు గొప్పదినంగా నిలిచిపోతుందన్నారు. కేవలం మూడు నెలల సమయంలోనే తన కల నిజమవుతుందని ఎన్నడూ ఊహించలేదని సీజే తెలిపారు.
తన కలను సాకారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, సీజే హిమా కోహ్లీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత జూన్‌లో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆర్బిట్రేషన్ సెంటర్ గురించి చీఫ్ జస్టిస్‌తో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. పెట్టుబడిదారులు తమ లిటిగేషన్‌ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నారన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు వల్ల ఆ సమస్యలు తీరుతాయన్నారు.
దుబాయ్‌లో ఇటీవల అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్లు ప్రారంభమైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సెంటర్ గురించి అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి కోరారు.