హమ్మయ్య.. ఎట్టకేలకు ఆ సినిమా మొదలైంది

సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయిందన్నారు. ఇక ఆ ప్రాజెక్టు పట్టాలపైకి రాదనుకున్నారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ పెదవి విరిచారు. ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో అవమానాల మధ్య దాదాపు…

సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయిందన్నారు. ఇక ఆ ప్రాజెక్టు పట్టాలపైకి రాదనుకున్నారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ పెదవి విరిచారు. ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో అవమానాల మధ్య దాదాపు నాలుగేళ్లుగా నలుగుతూ వస్తున్న బంగార్రాజు ప్రాజెక్టు ఎట్టకేలకు మొదలైంది. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

మనం సినిమా తర్వాత నాగార్జున-నాగచైతన్య బంగార్రాజు సినిమాతో మరోసారి కలిశారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా కృతి షెట్టిని తీసుకున్నారు. ఆమె కూడా లాంఛింగ్ కు హాజరైంది.

బంగార్రాజు స్క్రిప్ట్ విషయంలో నాగార్జున ఓ పట్టాన సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాదాపు ఏడాది పాటు నాగ్-కల్యాణకృష్ణ చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలా ఒక దశలో ప్రాజెక్టు ఆగిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు కల్యాణకృష్ణతో పాటు పలువురు స్టార్ రైటర్స్ కలిసి పనిచేసి, ఈ సెమీ-ఫాంటసీ స్క్రిప్ట్ ను ఓ కొలిక్కి తీసుకొచ్చారు.

అదేంటో ప్రస్తుతం నాగార్జున కెరీర్ లో ఆగిపోయిందనుకున్న సినిమాలన్నీ వరుసపెట్టి మొదలవుతున్నాయి. మొన్నటివరకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఆగిపోయిందనుకున్నారు. ఆ సినిమా మొదలై, షెడ్యూల్స్ కూడా పూర్తిచేసుకుంటోంది. కట్ చేస్తే, 4 ఏళ్లుగా సాగుతున్న బంగార్రాజు ప్రాజెక్టు కూడా ఇప్పుడు మొదలైంది.

సెట్స్ పైకి వెళ్లకముందే బంగార్రాజు బిజినెస్ పూర్తయిన సంగతి తెలిసిందే. జీ గ్రూప్ సినిమా ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా చేరింది. సో.. ఆటోమేటిగ్గా శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ రైట్స్ ఈ గ్రూప్ వశమయ్యాయి.