ఇంత వరకూ జగన్ ప్రభుత్వ బాధితులను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు లోకేశ్ పరామర్శించడం చూశాం. కానీ ఇప్పుడు లోకేశ్ బాధితుడికి టీడీపీ ముఖ్య నేతల పరామర్శ గురించి వినాల్సి వస్తోంది. రాజకీయాల్లో ఇదో విచిత్ర పరిస్థితి. రాజకీయాల్లో ఆయన అనుభవమంత వయసు కూడా లేని లోకేశ్ దెబ్బకు ఆ వృద్ధ మనసు గాయపడింది. పార్టీలో తన మాట చెల్లుబాటు కాకుండా, ఒంటరి చేశారంటూ రాజకీయ కురువృద్ధుడు ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్ వ్యవహార శైలితో మనస్తాపానికి గురై రాజకీయ చరమాంకంలో అగౌరవంగా నిష్క్రమించాల్సిన దుస్థితి నెలకుంది. పార్టీలకు అతీతంగా ఆయనపై సానుభూతి వెల్లువెత్తుతోంది. అయ్యో… ఎలాంటి నాయకుడికి ఎలాంటి దుస్థితి వచ్చిందనే ఓదార్పు మాటలు వినవస్తున్నాయి. ఆ గాయపడ్డ హృదయం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని అందరికీ తెలుసు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా జగన్ వేవ్‌లో కూడా గెలుపొందిన నేత ఆయన.
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన చంద్రబాబు, లోకేశ్‌లకు ఫోన్ చేస్తే కనీసం అటెండ్ చేసే పరిస్థితి లేదు. పార్టీని అంటి పెట్టుకున్న వాళ్లకు అన్యాయం జరుగుతోందని అధినేతల దృష్టికి తీసుకెళ్లాలనే ఆయన తపన ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు తనతో మాట్లాడిన పార్టీ నేతలను సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతలే బండబూతులు తిడుతున్నారని ఆయన మొదటిసారిగా బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ… ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన చెంతకు అధిష్టానం ప్రతినిధులుగా మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్‌రావులను పంపారు. లోకేశ్ ఇగోతో హర్ట్ అయిన బుచ్చయ్య చౌదరిని టీడీపీ నేతలు ఓదార్చుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండోరోజు కూడా రాజమండ్రిలో బుచ్చయ్య ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమి కూడాయి.
టీడీపీ అధిష్టానం దూతల బుజ్జగింపులకు లొంగిపోయి, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? లేక గట్టిగా నిలబడతారా? అనే ఉత్కంఠ నెలకుంది. ఈ రోజు రాత్రికైనా బుచ్చయ్యతో చర్చలు కొలిక్కి వస్తాయా? లేక తెలుగు టీవీ సీరియల్‌ను తలపిస్తాయా? అనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది.